MSRaju Agadha Movie Telugu Review
చిత్రం : అగధ
రేటింగ్ : 2.75/5
నటీనటులు : కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, భాను చందర్, జోవివ, ఉల్కా గుప్తా, జిజు, వనిత విజయ్ కుమార్, రోషన్ బషీర్, వివా రాఘవ తదితరులు…
బ్యానర్: శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్
నిర్మాత: కాశీ విశాలాక్షి బలుసు
కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం : ఎం.ఎస్.రాజు
సంగీతం : రాకేశ్ వెంకటాపురం
సినిమాటోగ్రాఫర్ (డీవోపీ): నాని చమిడిశెట్టి
ఎడిటర్ : జునైద్ సిద్ధిఖీ
విడుదల తేదీ: 14 ఆగస్టు 2026
MSRaju Agadha Movie Telugu Review
కథ విషయానికొస్తే :
ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల నేపథ్యంలో ‘అగధ’ కథ సాగుతుంది. ఆధ్యాత్మికత, దైవశక్తులపై నమ్మకం ఉన్న మహాదేవి (కామాక్షి భాస్కర్ల)కు ఆత్మలతో మాట్లాడే శక్తి ఉంటుంది. తన వద్దకు వచ్చే సమస్యలను ఆత్మలతో మాట్లాడి పరిష్కరించే ప్రయత్నం చేస్తుంటుంది. అయితే ఆమె కుటుంబంలో వరుసగా చోటుచేసుకుంటున్న అనూహ్య మరణాలు మహాదేవిని కలవరపెడతాయి. ముఖ్యంగా తన బాబాయ్ కూతురు మహిమ (ఉల్కా గుప్తా) గర్భంతో ఉండగానే ఆత్మహత్య చేసుకోవడం ఆమెను మరింత ఆలోచనలో పడేస్తుంది. అసలు మహిమ ఎందుకు చనిపోయింది? ఆమె మరణం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? కుటుంబంలోని మరికొందరు ఎందుకు వింతగా ప్రవర్తిస్తున్నారు? మహాదేవి సోదరి హరిణి (జోవికా), మహిమ ప్రియుడు సింహ (శ్రవణ్ రెడ్డి) చుట్టూ ఏం జరుగుతోంది? అన్నింటికంటే అసలు ‘అగధ’ అంటే ఏమిటి? దాని వెనుక ఉన్న శక్తి ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి..
కామాక్షి భాస్కర్ల ‘అగధ’ సినిమాకు ప్రధాన బలం. మహాదేవి పాత్రలో ఆమె చాలా సీరియస్‌గా కనిపించింది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో, భయాన్ని వ్యక్తపరిచే సందర్భాల్లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. డైలాగ్స్ కంటే కొన్ని చోట్ల కేవలం ఎక్స్‌ప్రెషన్స్‌తోనే సీన్‌ను క్యారీ చేయడం ప్లస్ పాయింట్. జోవికాకు కూడా సినిమాలో మంచి పాత్ర లభించింది. కొన్ని సన్నివేశాల్లో ఆమె చూపించిన భయం, షాక్, ఎమోషన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. శ్రవణ్ రెడ్డి తన పాత్ర పరిధిలో బాగానే నటించాడు. ఉల్కా గుప్తా, భాను చందర్, వనిత విజయ్ కుమార్, జిజు, రోషన్ బషీర్ తదితరులు తమకు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నీకల్ టీమ్ గురించి..
టెక్నికల్‌గా ‘అగధ’కు కొన్ని మంచి అంశాలు ఉన్నాయి. రాకేశ్ వెంకటాపురం అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరింత ఎలివేట్ చేసింది. ముఖ్యంగా థ్రిల్లింగ్ సన్నివేశాల్లో BGM సినిమాకు బలంగా నిలిచింది. నాని చమిడిశెట్టి సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది. అడవి, గుహలు, చీకటి వాతావరణం, మిస్టిక్ ఎలిమెంట్స్‌ను విజువల్‌గా చూపించడంలో కెమెరా పనితనం బాగుంది. ప్రొడక్షన్ డిజైన్ విషయంలో మాత్రం మరింత సహజత్వం తీసుకురావాల్సిన అవసరం కనిపిస్తుంది. కొన్ని సన్నివేశాల్లో సెట్స్‌లో చిత్రీకరించిన ఫీలింగ్ రావడం ఇబ్బంది పెడుతుంది. ఎడిటింగ్ మరింత క్రిస్ప్‌గా ఉంటే సినిమా పేస్ మెరుగ్గా ఉండేది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలను కుదించి ఉంటే థ్రిల్ మరింత పెరిగేది. దర్శకుడిగా ఎం.ఎస్. రాజు కొత్త తరహా మిస్టిక్ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నం చేశారు. కాన్సెప్ట్‌లో ఆసక్తి ఉన్నప్పటికీ, దానికి తగ్గట్టుగా ప్రతి సన్నివేశాన్ని మరింత ఉత్కంఠభరితంగా మలచడంలో అక్కడక్కడా తడబాటు కనిపిస్తుంది.
సినిమా ఎలా ఉందంటే..
సూపర్‌నేచురల్, మిస్టిక్ థ్రిల్లర్ జానర్‌కు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ‘అగధ’ కూడా మొదటి నుంచే అదే ఆసక్తిని క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది. సినిమా ప్రారంభంలోనే కొన్ని సంఘటనలను చూపిస్తూ ప్రేక్షకులలో ప్రశ్నలను రేకెత్తించడం బాగుంది. ముఖ్యంగా ‘అగధ’ అంటే ఏంటి అనే విషయాన్ని వెంటనే రివీల్ చేయకుండా దర్శకుడు కథను ముందుకు తీసుకెళ్లడం ఫస్టాఫ్‌కు మంచి బలంగా నిలుస్తుంది. అడవులు, ఆత్మలు, వింత సంఘటనలు, భయపెట్టే సన్నివేశాలతో కథలో ఒక మిస్టరీ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఇంటర్వెల్ వరకు ‘అసలు ఏం జరుగుతోంది?’ అనే ఆసక్తి కొంతవరకు కొనసాగుతుంది. అయితే ‘అగధ’ వెనుక ఉన్న అసలు రహస్యం బయటకు వచ్చిన తర్వాత కథలో కొత్తదనం కొంత తగ్గుతుంది. దైవశక్తి, దుష్టశక్తి మధ్య పోరాటం అనే కాన్సెప్ట్ గతంలో ఎన్నో సినిమాల్లో చూసినదే కావడంతో సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు ఊహించినట్టుగానే అనిపిస్తాయి. అయితే దర్శకుడు కొన్ని కీలక అంశాలను క్లైమాక్స్ వరకు తీసుకెళ్లిన విధానం మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా దుష్టశక్తిని ఎదుర్కొనే విధానం, దాన్ని కట్టడి చేసే ప్రయత్నం సాధారణ హారర్ సినిమాల తరహాలో కాకుండా కాస్త భిన్నంగా అనిపిస్తుంది. అయితే కథలో ఉన్న ఆసక్తికరమైన పాయింట్‌కు తగ్గ స్థాయిలో స్క్రీన్‌ప్లేను మరింత గ్రిప్పింగ్‌గా రాసుకుని ఉంటే సినిమా ప్రభావం ఇంకాస్త ఎక్కువగా ఉండేది. కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగడం, సెకండాఫ్‌లో కథ ఒకే పాయింట్ చుట్టూ తిరుగుతున్నట్టుగా అనిపించడం మైనస్‌గా మారాయి.
ప్లస్ పాయింట్స్ :
కామాక్షి భాస్కర్ల నటన
ఫస్టాఫ్‌లో మిస్టరీ, సస్పెన్స్
ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
సినిమాటోగ్రఫీ
క్లైమాక్స్‌లో కొన్ని కొత్త ప్రయత్నాలు
మైనస్ పాయింట్స్ :
సెకండాఫ్‌లో స్లో నేరేషన్
‘అగధ’ రహస్యం రివీల్ అయిన తర్వాత తగ్గే థ్రిల్
కొన్ని చోట్ల రొటీన్‌గా అనిపించే ట్రీట్మెంట్
ప్రొడక్షన్ డిజైన్‌లో సహజత్వం లోపించడం
మరింత క్రిస్ప్‌గా ఉండాల్సిన ఎడిటింగ్
ఫైనల్‌గా చెప్పాలంటే..
‘అగధ’లో కొత్తగా అనిపించే మిస్టిక్ థ్రిల్లర్ పాయింట్ ఉంది. దానికి తగ్గట్టుగా కొన్ని మంచి సన్నివేశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కామాక్షి భాస్కర్ల నటన, BGM, విజువల్స్ సినిమాకు ప్లస్‌గా నిలుస్తాయి. అయితే ఫస్టాఫ్‌లో క్రియేట్ చేసిన మిస్టరీ, సస్పెన్స్‌ను సెకండాఫ్‌లో అదే స్థాయిలో కొనసాగించలేకపోవడం సినిమాకు ప్రధాన మైనస్. హారర్, మిస్టిక్, సూపర్‌నేచురల్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ‘అగధ’ ఒకసారి ప్రయత్నించదగ్గ సినిమా. అయితే భారీ అంచనాలతో కాకుండా వెళితేనే సినిమా కొంతవరకు నచ్చే అవకాశం ఉంది.