Suriya Viswanath & Sons Pre ReleaseEvent
తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్లో తెరకెక్కిన క్రేజీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘విశ్వనాథ్ & సన్స్’. మమితా బైజు కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరించగా.. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Suriya Viswanath & Sons Pre ReleaseEvent
తాజాగా మంగళవారం హైదరాబాద్లోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ సందర్భంగా హీరో సూర్య మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ప్రేమను గుర్తు చేసుకున్నారు. దాదాపు 28 ఏళ్లుగా తనను ఆదరిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ కారణంగానే ఇలాంటి మంచి సినిమా సాధ్యమైందని చెప్పారు. ‘విశ్వనాథ్ & సన్స్’ తనకు ఎంతో ప్రత్యేకమైన సినిమా అని పేర్కొన్న సూర్య.. ‘గజినీ’, ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ చిత్రాలకు తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన ఆదరణను ఈ సినిమాకు కూడా అందించాలని కోరుకున్నారు. వెంకీ అట్లూరి రచనా ప్రతిభను ప్రత్యేకంగా ప్రశంసించిన ఆయన.. భవిష్యత్తులో ఆయనతో మరోసారి పనిచేయాలని ఉందని తెలిపారు.
దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. ‘విశ్వనాథ్ & సన్స్’ తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిన సినిమా అని అన్నారు. ఇది కేవలం సూర్య అభిమానుల కోసం రూపొందించిన చిత్రం కాదని, వారి కుటుంబాలను కూడా అలరించేలా తెరకెక్కించామని తెలిపారు. సినిమా చూస్తున్నంతసేపూ ప్రేక్షకుల ముఖంపై చిరునవ్వు ఉంటుందని, ఈ మాటను దర్శకుడిగా కాకుండా ఒక ప్రేక్షకుడిగా చెబుతున్నానని వెంకీ అట్లూరి అన్నారు. సూర్య, మమితా బైజు జోడీ తెరపై ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, ఈ సినిమా ప్రేమ, కుటుంబ బంధాలను అందంగా ఆవిష్కరిస్తుందని పేర్కొన్నారు.
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. ‘విశ్వనాథ్ & సన్స్’పై తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. సూర్య కెరీర్లో ‘గజినీ’, ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ చిత్రాలకు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందని, వాటి సరసన ఈ సినిమా కూడా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తల్లీకొడుకుల అనుబంధం నేపథ్యంలో సినిమా సాగుతుందని, అమ్మను ప్రేమించే ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం నచ్చుతుందని నాగవంశీ అన్నారు. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు తమ తల్లిని మరింతగా ప్రేమిస్తారని పేర్కొన్నారు.
నటులు రాధికా శరత్ కుమార్, మమితా బైజు, హైపర్ ఆది, లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి, నిర్మాతలు కె.ఎల్. నారాయణ, వై. రవిశంకర్ తదితరులు కూడా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రేమ, అనుబంధాలు, కుటుంబ విలువలను ప్రధానంగా తీసుకున్న ఈ చిత్రం ఈ జనరేషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని రాధికా శరత్ కుమార్ పేర్కొన్నారు.