Chiranjeevi Praises Korean Kanakaraju Team
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన నాటి నుంచే హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో మంచి స్పందనను సొంతం చేసుకుంటున్న నేపథ్యంలో చిత్ర బృందం మెగా బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌ను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Chiranjeevi Praises Korean Kanakaraju Team
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ఒక సినిమా విజయం సాధిస్తే నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో పాటు ఎంతోమందిలో ఆనందాన్ని నింపుతుందని అన్నారు. ‘కొరియన్ కనకరాజు’ విజయంలో భాగస్వామ్యం కావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ స్థాయిలో విజయాన్ని అందించిన ప్రేక్షకులకు తలవంచి కృతజ్ఞతలు చెప్పడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. మేర్లపాక గాంధీ విజన్‌ను ప్రత్యేకంగా అభినందించిన చిరంజీవి , సాధారణంగా హారర్ కామెడీ కథలు వచ్చినప్పటికీ ఈ సినిమాలో కొరియన్ ఫ్లేవర్, కల్చర్‌ను జోడించడం కొత్త ఆలోచనగా నిలిచిందన్నారు. ఈ వినూత్నతే సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారిందని ప్రశంసించారు. గాంధీ మరిన్ని మంచి సినిమాలు చేయాలని ఆకాంక్షించారు. వరుణ్ తేజ్‌పై కూడా చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ‘ముకుంద’, ‘కంచె’, ‘అంతరిక్షం’ వంటి సినిమాల నుంచి వరుణ్ ఎప్పటికప్పుడు విభిన్న కథలు, పాత్రలను ఎంచుకుంటూ తనను తాను నటుడిగా నిరూపించుకుంటున్నారని అన్నారు. ఆర్టిస్ట్‌గా నిలబడాలనే తపన వరుణ్‌లో ఉందని, ఇదే పట్టుదలతో ముందుకు సాగితే విలక్షణ నటుడిగా తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటాడని తెలిపారు. అంతేకాదు, తనదైన సరదా వ్యాఖ్యతో వేడుకలో నవ్వులు పూయించారు చిరంజీవి. “ఇది వరుణ్ సక్సెస్ కాదు.. మా బుడ్డోడు వాయుతేజ్ సక్సెస్. ఈ సక్సెస్‌ను వాయు ఖాతాలో వేయాలి” అంటూ నవ్వుతూ చెప్పడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సినిమాలో సత్య, రితిక నాయక్, మురళీధర్ గౌడ్ తదితరుల నటనను కూడా చిరంజీవి ప్రశంసించారు. ముఖ్యంగా సత్య కామెడీ సినిమాకు అదనపు బలంగా నిలిచిందన్నారు. అలాగే నిర్మాతలు సినిమాను అనుకున్న సమయంలో, అనుకున్న బడ్జెట్లో పూర్తి చేయడం కూడా తొలి విజయంగా అభివర్ణించారు. 2026 సెకండ్ హాఫ్‌లో వరుసగా మంచి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని చిరంజీవి పేర్కొన్నారు. మంచి కంటెంట్ అందిస్తే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వస్తారనే విషయాన్ని ఈ విజయాలు నిరూపిస్తున్నాయని అన్నారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ‘కొరియన్ కనకరాజు’ను ప్రేక్షకులు ఆదరించి విజయాన్ని అందించడం చాలా ఆనందంగా ఉందన్నారు. చిన్నప్పటి నుంచి పెదనాన్న చిరంజీవి తమకు విలువలు, కష్టపడే తత్వం, క్రమశిక్షణ నేర్పించారని గుర్తు చేసుకున్నారు. సినిమాను విజయవంతం చేసిన నిర్మాతలు రాజీవ్ రెడ్డి, వంశీ, యూవీ క్రియేషన్స్ టీమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు మేర్లపాక గాంధీ తనను సినిమాలో చాలా కొత్తగా చూపించారని, రితిక మంచి కోస్టార్ అని చెప్పారు. సత్యతో కలిసి ఈ సినిమా కోసం బ్రదర్స్‌లా పనిచేశామని, అతని కాంట్రిబ్యూషన్ ఎంతో ఉందన్నారు. తన భవిష్యత్ లక్ష్యాల గురించి మాట్లాడుతూ.. “పెదనాన్న, అమ్మానాన్న కళ్లల్లో ఎప్పుడూ గౌరవం కనిపించాలి. బాబాయ్, అన్నయ్య కళ్లల్లో ఆనందం చూడాలి. మెగా ఫ్యాన్స్‌కు మంచి సినిమా ఇవ్వాలి” అని తన మనసులోని మాటను పంచుకున్నారు. ఆగస్టు 22 తనకు ఎప్పుడూ ప్రత్యేకమైన రోజని, ఆ రోజు పెదనాన్న ఇంటికి వెళ్లేవాడినని చెప్పిన వరుణ్.. ‘కొరియన్ కనకరాజు’ విజయం ఈ ఆగస్టును తనకు మరింత ప్రత్యేకంగా మార్చిందన్నారు. ఈ సందర్భంగా చిరంజీవికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్‌డే విషెస్ తెలిపారు.
నాగబాబు మాట్లాడుతూ.. తామంతా ఈ స్థాయిలో ఉండటానికి ప్రధాన కారణం చిరంజీవి అని, తమ కుటుంబానికి ఆయన ప్రాణవాయువు అని అన్నారు. ‘కొరియన్ కనకరాజు’ విజయం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. వరుణ్ విషయంలో తాను ఎంతో గర్వపడుతున్నానని, చిన్నప్పటి నుంచే చిరంజీవి-వరుణ్ మధ్య ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. కుటుంబంలో ఎవరికైనా సమస్య వచ్చినా చిరంజీవే పరిష్కరిస్తారని చెబుతూ “ఐ లవ్ యూ అన్నయ్య” అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ.. సినిమా చూసిన అనంతరం చిరంజీవి ‘నవ్వులే నవ్వులు’ అంటూ స్పందించడం తమకు ఎంతో పెద్ద ప్రోత్సాహంగా నిలిచిందన్నారు. సినిమా నచ్చడంతో పాటు తనవంతు సహాయం చేస్తానని చిరంజీవి చెప్పడంతో ఈ మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్‌ను నిర్వహించినట్లు తెలిపారు. వరుణ్ తేజ్‌తో గతంలో ‘కంచె’, ‘అంతరిక్షం’ చిత్రాలు చేశామని, ఇప్పుడు ‘కొరియన్ కనకరాజు’తో మరో ప్రత్యేకమైన సినిమాను అందించామని చెప్పారు. మేర్లపాక గాంధీ అద్భుతంగా తెరకెక్కించారని, తమన్ మంచి సంగీతం అందించారని ప్రశంసించారు.
దర్శకుడు మేర్లపాక గాంధీ మాట్లాడుతూ.. సినిమా విడుదలైనప్పటి నుంచి మంచి కలెక్షన్స్ వస్తున్నాయని, టికెట్లు కూడా బాగా అమ్ముడవుతున్నాయని తెలిపారు. అయితే తన విజయానికి ఒక చిన్న వెలితి ఉండేదని, చిరంజీవి ఈ వేడుకకు రావడంతో అది పూర్తిగా తొలగిపోయిందని అన్నారు. వరుణ్ తేజ్ తన సినిమాకు బ్యాక్‌బోన్‌గా నిలిచారని, కాలికి గాయం ఉన్నప్పటికీ ప్రమోషన్స్‌లో ఎంతో చురుగ్గా పాల్గొన్నారని గాంధీ గుర్తు చేసుకున్నారు. రితిక అద్భుతంగా నటించిందని, సత్య కామెడీ సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందని చెప్పారు. తమన్ సంగీతం సినిమాకు ప్రాణం పోసిందని అన్నారు.
హీరోయిన్ రితిక నాయక్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, మురళీధర్ గౌడ్, కాసర్ల శ్యామ్ తదితరులు కూడా ఈ విజయోత్సవ వేడుకలో పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారు. ప్రేక్షకులు అందించిన విజయానికి కృతజ్ఞతలు తెలిపారు.