Shakalaka Shankar Merangi Junction
విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు షకలక శంకర్ మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మేరంగి జంక్షన్’. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇంటెన్సివ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది.
Shakalaka Shankar Merangi Junction
యువన్ టూరింగ్ టాకీస్ పతాకంపై మాస్టర్ దివ్యాన్ష్ సమర్పణలో ఈ చిత్రాన్ని రవి కృష్ణ గొల్లు, రాజేష్ గంగునాయుని, పెద్దింటి మోహన రావు, చొక్కపు రాములమ్మ, సీర గణపతి నాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శివ గణేష్ కథను రచించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. షకలక శంకర్, సాహితీ దాసరి, వినీత కందాల, సంపత్ కుమార్, ప్రభాకర్ చొక్కపు, రాధా కోహినూర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
‘మేరంగి జంక్షన్’ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తవుతోంది. ఇప్పటికే ఒక పాట, ఒక ఫైట్ మినహా టాకీ షూటింగ్ మొత్తం పూర్తయింది. కేవలం 47 రోజుల్లో టాకీ పార్ట్‌తో పాటు రెండు పాటల చిత్రీకరణను పూర్తి చేసినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి.
ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని మేరంగి అనే గ్రామం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుంది. ఆ ప్రాంతంలో చోటుచేసుకునే కొన్ని యదార్థ సంఘటనల సమాహారంగా ‘మేరంగి జంక్షన్’ కథను రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు.
ఈ చిత్రంలో ఏజెన్సీ ఏరియాలో విధులు నిర్వహించే పోలీస్ అధికారిగా షకలక శంకర్ కనిపించనున్నారు. ఇప్పటివరకు ప్రేక్షకులు చూసిన పాత్రలకు భిన్నంగా ఈ సినిమాలో ఆయన సీరియస్ పోలీస్ పాత్రలో తన నటనతో ఆకట్టుకోనున్నారని చిత్ర బృందం చెబుతోంది.
మొదటి సీన్ నుంచి క్లైమాక్స్ వరకు ఊహించని మలుపులు, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు శివ గణేష్ తెలిపారు. ప్రేక్షకులకు సరికొత్త ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని మేకర్స్ పేర్కొన్నారు.
అజయ్ పట్నాయక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ‘మేరంగి జంక్షన్’ టైటిల్ సాంగ్‌తో పాటు ‘నీల వేణి’ అనే మెలోడీ సాంగ్ ప్రేక్షకులను అలరించనున్నాయి. కిరణ్ చేబ్రోలు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, పిజె రామ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్న ఈ చిత్రాన్ని 2026 చివరి నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. యదార్థ సంఘటనలు, పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఊహించని ట్విస్టులతో ‘మేరంగి జంక్షన్’ ఎలాంటి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అందిస్తుందో చూడాలి.