Dhandha Hero DoraSaiTeja Interview
చాయ్ షాట్స్ రూపొందించిన వర్టికల్ సిరీస్ ‘దందా’తో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న దొర సాయి తేజ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. దర్శకుడు ఆదిత్య దేవులపల్లి తెరకెక్కించిన ఈ సిరీస్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా తన సినీ ప్రయాణం, కంటెంట్ క్రియేషన్, ‘దందా’ సక్సెస్, భవిష్యత్ లక్ష్యాల గురించి దొర సాయి తేజ ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
Dhandha Hero DoraSaiTeja Interview
‘‘ప్రభాస్ నటించిన ‘ అడవి రాముడు’ సినిమాలో చిన్నప్పటి పాత్రకు డబ్బింగ్ చెప్పడం నా సినీ ప్రయాణానికి తొలి అడుగు. తర్వాత ‘కొత్త బంగారు లోకం’, ‘హై స్కూల్’ వంటి ప్రాజెక్ట్‌ల్లో నటించాను. ఆర్జీవీ గారితో కలిసి పని చేసిన తర్వాత సినిమాపై మరింత అవగాహన వచ్చింది. 2018 నుంచి యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేషన్‌ను సీరియస్‌గా ప్రారంభించాను. ‘బ్యాక్ బెంచర్స్’ నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. గత ఏడాది సొంతంగా కంటెంట్ క్రియేషన్ కంపెనీ కూడా ప్రారంభించాను. ఇప్పుడు ‘దందా’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి వారి ప్రేమను అందుకుంటున్నాను. నేను ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కంటెంట్ గురించే ఆలోచిస్తుంటాను. ఒక కంటెంట్ క్రియేటర్‌గా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ప్రతిరోజూ కొత్తగా నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటాను. కంటెంట్ క్రియేషన్ నా బిజినెస్ అయితే, సినిమా నా ప్యాషన్. ఈ రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్లాలనేదే నా ఆలోచన. నా వయసు వాళ్లు పార్టీలు, ఎంజాయ్మెంట్ గురించి ఆలోచిస్తే… నేను మాత్రం ప్రతిరోజూ కొత్తగా ఏదో ఒకటి నేర్చుకోవాలని, క్రియేట్ చేయాలని అనుకుంటాను. పడిపోయిన ప్రతిసారి ఒక కొత్త గుణపాఠం నేర్చుకుంటాను. నా వయసు కంటే ఐదేళ్లు పెద్దవాడిలా ఆలోచించే ప్రయత్నం చేస్తాను. అందుకే నా జీవితంలో పనికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది”అని అన్నారు.

సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ… “ప్రశంసలు కూడా వస్తాయి… విమర్శలు కూడా వస్తాయి. వాటిని సమానంగా స్వీకరించాలి. నాకు సోషల్ మీడియా అనేది ఒక బ్రిడ్జ్‌లాంటిది. అక్కడ నన్ను అభిమానించే వాళ్లను థియేటర్ వరకు తీసుకురావాలనేది నా లక్ష్యం. ఇన్ఫ్లూయెన్సర్ అని పిలవడం కంటే నటుడు అని పిలిస్తేనే నాకు ఎక్కువ ఆనందం”అని చెప్పారు.
కొత్తగా కంటెంట్ క్రియేషన్‌లోకి రావాలనుకునే వారికి నాదొక సూచన. బయట నుంచి చూసేవారికి ఇది చాలా గ్లామరస్‌గా కనిపిస్తుంది. కానీ ఇందులో నిలబడటం అంత సులభం కాదు. ప్రశంసలకు ఎంత సిద్ధంగా ఉంటారో… విమర్శలకు కూడా అంతే సిద్ధంగా ఉండాలి. అప్పుడే ఈ రంగంలో సర్వైవ్ అవ్వగలుగుతారు.
‘దందా’లోని అరవింద్ పాత్ర గురించి మాట్లాడిన దొర సాయి తేజ… “ఇలాంటి ఛాలెంజింగ్ పాత్ర కోసం చాలా కాలంగా ఎదురుచూశాను. ఆ అవకాశం ‘దందా’తో వచ్చింది. ఆ పాత్రకు వస్తున్న స్పందన చాలా ఆనందాన్ని ఇస్తోంది. ఈ క్రెడిట్ మొత్తం దర్శకుడు ఆదిత్య దేవులపల్లికే చెందుతుంది. ఆయన నాపై పెట్టుకున్న నమ్మకమే అరవింద్ పాత్రను ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా చేసింది.” అని చెప్పారు.
సింగిల్ టేక్ ఆర్టిస్టుగా పేరు రావడంపై స్పందిస్తూ… “నాకు మానిటర్ చూసే అలవాటు ఉండదు. ఒక సీన్‌కు ముందు, తర్వాత ఏముందో ముందే అర్థం చేసుకుని సెట్స్‌కు వెళ్తాను. అందుకే ఎక్కువ శాతం సీన్లు సింగిల్ టేక్‌లోనే పూర్తవుతాయి. టేక్స్ ఎక్కువైతే ప్రొడక్షన్ ఖర్చు కూడా పెరుగుతుంది. అందుకే పాత్రలో పూర్తిగా లీనమై నటిస్తాను.” అని వివరించారు.
మార్కెటింగ్ ప్రాధాన్యం గురించి మాట్లాడుతూ…”మంచి కంటెంట్ ఉంటే సరిపోదు. దాన్ని ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లే మార్కెటింగ్ కూడా అంతే ముఖ్యం. ‘దందా’ కోసం చేసిన ప్రమోషనల్ వీడియో ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. అదే మా విజయానికి బలమైన కారణాల్లో ఒకటి.” అని అన్నారు.
అభిమానుల గురించి చెబుతూ… “వాళ్ల ప్రేమ ఒక్క రోజులో రాలేదు. ఎన్నో ఏళ్లుగా చేసిన కంటెంట్ వల్ల వాళ్లు నాతో కనెక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో పాజిటివిటీతో పాటు నెగెటివిటీ కూడా ఉంటుంది. కానీ నిజం నాకు తెలుసు. అందుకే నా పనిపైనే దృష్టి పెడతాను.” అని పేర్కొన్నారు.
సోషల్ ఇన్ఫ్లూయెన్సర్ల బాధ్యతపై స్పందిస్తూ… “ఈ రోజుల్లో చాలామంది సెలబ్రిటీల కంటే ఇన్ఫ్లూయెన్సర్లనే ఎక్కువగా ఫాలో అవుతున్నారు. వాళ్లు చెప్పే మాటలు, వేసుకునే దుస్తులు, ప్రవర్తన చాలా మందిపై ప్రభావం చూపిస్తాయి. అందుకే ఇన్ఫ్లూయెన్సర్లు చాలా బాధ్యతగా ఉండాలి.” అని సూచించారు.
చివరగా తన భవిష్యత్ లక్ష్యాన్ని వివరిస్తూ… “ప్రతి సాధారణ వ్యక్తి జీవితానికి దగ్గరగా ఉండే కథల్లో నటించాలనుకుంటున్నాను. జీరో నుంచి హీరోగా ఎదిగే పాత్రలు చేయాలని ఉంది. ప్రేక్షకులు నన్ను చూసి గర్వపడేలా మంచి సినిమాలు చేయాలనేది నా కల. ముఖ్యంగా… ప్రేక్షకులు నా కోసం ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి న్యాయం చేయాలనే లక్ష్యంతోనే నేను పని చేస్తాను.” అంటూ తన మనసులోని మాటను దొర సాయి తేజ పంచుకున్నారు.