Versatile actor Pradeep Rawat passes away
భారతీయ సినీ పరిశ్రమలో విలన్ పాత్రలకు కొత్త గుర్తింపును తీసుకొచ్చిన సీనియర్ నటుడు ప్రదీప్ రావత్ (74) ఇకలేరు. కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. 1952 జనవరి 21న మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో జన్మించిన ప్రదీప్ రావత్.. తన నటనా ప్రయాణాన్ని బి.ఆర్. చోప్రా రూపొందించిన ‘మహాభారత్’ సీరియల్లో అశ్వత్థామ పాత్రతో ప్రారంభించారు. ఆ పాత్ర ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత హిందీ చిత్రాల్లో ప్రతినాయకుడిగా అవకాశాలు అందుకుని, క్రమంగా సౌత్ సినిమాల్లోనూ తనదైన ముద్ర వేశారు.
Versatile actor Pradeep Rawat passes away
తెలుగు ప్రేక్షకులకు ‘భిక్షు యాదవ్’గా గుర్తింపు
తెలుగు ప్రేక్షకులు ప్రదీప్ రావత్‌ను ఎక్కువగా గుర్తుంచుకునేది ‘సై’ సినిమాలో ఆయన పోషించిన భిక్షు యాదవ్ పాత్ర ద్వారానే. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రంలో ఆయన నటన ప్రేక్షకులను భయపెట్టడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అనంతరం భద్ర, ఛత్రపతి, లక్ష్మి, దేశ ముదురు, యోగి, గజినీ, మస్కా, ఓయ్ వంటి 60పైగా తెలుగు చిత్రాల్లో విభిన్న విలన్ పాత్రల్లో మెప్పించారు. తెలుగు ఆయన చివరిగా నటించిన ‘గాయపడ్డ సింహం’ చిత్రం ఇటీవల విడుదలైంది. దీనికి ముందు చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లో డేవిడ్ పాత్రతో అలరించారు.
తమిళంలో తెరకెక్కిన ‘గజినీ’ చిత్రంలో ఆయన చేసిన ప్రతినాయక పాత్ర భారీ గుర్తింపు తెచ్చింది. అదే పాత్రను హిందీ రీమేక్‌లోనూ పోషించి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ‘లగాన్’, ‘సర్ఫరోష్’ వంటి చిత్రాల్లోనూ ఆయన నటన ప్రత్యేకంగా నిలిచింది.
తెరపై క్రూరుడు.. బయట సౌమ్యుడు
తెరపై ఎంత భయంకరమైన విలన్‌గా కనిపించినా, వ్యక్తిగత జీవితంలో ప్రదీప్ రావత్ ఎంతో సౌమ్య స్వభావం కలిగిన వ్యక్తిగా సహనటులు చెబుతుంటారు. తన శరీరాకృతి, గంభీరమైన స్వరం, కళ్లతోనే భయపెట్టే అభినయం ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. ఒకే తరహా పాత్రల్లో కాకుండా, ప్రతి పాత్రకు ప్రత్యేక శైలిని జోడించడం ఆయన ప్రత్యేకత.
సినీ పరిశ్రమకు తీరని లోటు
నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన తన సినీ ప్రయాణంలో హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, భోజ్‌పురి, నేపాలీ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించిన ప్రదీప్ రావత్.. భారతీయ సినిమాకు చిరస్మరణీయమైన ప్రతినాయక పాత్రలను అందించారు. ఆయన మరణంతో భారతీయ సినీ పరిశ్రమ ఓ విలక్షణ నటుడిని కోల్పోయింది. కానీ ఆయన పోషించిన పాత్రలు మాత్రం ప్రేక్షకుల జ్ఞాపకాల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి.