Karunamaya Begins with Grand Pooja Ceremony
తెలుగు ప్రేక్షకులను కుటుంబ భావోద్వేగాలతో ఆకట్టుకునే మరో చిత్రం ‘కరుణామయ’ బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. బాబీ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్–1గా సంకాబత్తుల నాగేశ్వరరావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో చైతన్య శక్తి, స్వాతి శ్రీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. హర్షవర్దన్ పారెళ్ళ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఆరాధ్య హైందవి సమర్పిస్తున్నారు.
Karunamaya Begins with Grand Pooja Ceremony


బుధవారం జరిగిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ప్రముఖ దర్శకులు వి.వి. వినాయక్, వి.ఎన్. ఆదిత్య ముఖ్య అతిథులుగా హాజరై క్లాప్ కొట్టి, చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. చిత్రబృందానికి తమ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నిర్మాత సంకాబత్తుల నాగేశ్వరరావు మాట్లాడుతూ..
“మా తొలి నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న ‘కరుణామయ’ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 23న, క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా మా ఆహ్వానాన్ని స్వీకరించి వచ్చిన వి.వి. వినాయక్ గారికి, వి.ఎన్. ఆదిత్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు” అని తెలిపారు.
దర్శకుడు హర్షవర్దన్ పారెళ్ళ మాట్లాడుతూ..
“‘కరుణామయ’ ఒక హృదయాన్ని తాకే కుటుంబ కథా చిత్రం. తండ్రీ-కొడుకుల బంధం చుట్టూ సాగే ఈ కథలో బలమైన భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. డిసెంబర్ 23న సినిమాను విడుదల చేయడానికి మా టీమ్ అంకితభావంతో పని చేస్తుంది” అన్నారు.
హీరో చైతన్య శక్తి మాట్లాడుతూ..
“‘కరుణామయ’ లాంటి మంచి కథలో భాగం కావడం ఆనందంగా ఉంది. నాపై నమ్మకం ఉంచిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాను” అన్నారు.
హీరోయిన్ స్వాతి శ్రీ మాట్లాడుతూ..
“‘కరుణామయ’లో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ సినిమా కేవలం ఒక వర్గానికే పరిమితం కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను భావోద్వేగంగా కనెక్ట్ చేసేలా ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు” అని తెలిపారు.
ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 23న క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.