Grand Launch Priyadarshi Idupu Kayitham
తెలుగు సినీ పరిశ్రమలో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. దర్శకుడు సుకుమార్, నిర్మాత బన్నీ వాస్ తమ సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్లపై హీరో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నిర్మిస్తున్న కొత్త చిత్రం ‘ఇడుపు కాయితం’. తెలంగాణ పల్లె జీవన శైలి, కుటుంబ బంధాలు, భావోద్వేగాలను ప్రతిబింబించే ఎంటర్టైనింగ్ ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రాన్ని యువ దర్శకుడు వంశీకృష్ణ దొండపాటి తెరకెక్కిస్తున్నారు. తెలంగాణ ఫోక్ సింగర్‌గా మంచి గుర్తింపు పొందిన నాగదుర్గ ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయం అవుతుంది.
Grand Launch Priyadarshi Idupu Kayitham
ఈ చిత్రం గురువారం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ముఖ్య అతిథిగా హాజరై ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇవ్వగా, నిర్మాతలు దిల్ రాజు, నవీన్ యెర్నేని, కేఎల్ దామోదర ప్రసాద్, ఎస్కేఎన్, బాపినీడు, ధీరజ్ మొగిలినేని, దర్శకులు మెహర్ రమేష్, చందూ మొండేటి, సాయి రాజేష్, వేణు ఊడుగుల, సాయి మార్తాండ్ పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఇడుపు కాయితం’లో అసలు హీరో కథే అని ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అన్నారు.
బిత్తిరి సత్తి మాట్లాడుతూ, ఈ సినిమా ప్రారంభోత్సవం పండుగ వాతావరణాన్ని తలపిస్తోందని, టైటిల్లో కాగితాలు చిరిగితే.. రేపు థియేటర్లలో టికెట్లు చిరిగే స్థాయిలో విజయం సాధించాలని ఆకాంక్షించారు.
నటి శివజ్యోతి (తీన్మార్ సావిత్రి) తన సినీ ప్రయాణానికి ఇదే తొలి చిత్రం కావడం ఆనందంగా ఉందని, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే కథలో భాగమవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
చంద్రవ్వ, జోర్దార్ సుజాత, రచ్చరవి, మైమ్ మధు, అభయ్ బేతిగంటి తదితరులు కూడా ఈ చిత్రం భావోద్వేగాలతో పాటు ప్రతి కుటుంబానికి కనెక్ట్ అయ్యే కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలిపారు. ముఖ్యంగా ‘బలగం’ తర్వాత మరో నేటివిటీకి దగ్గరైన సినిమా అవుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.
సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ, ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంట్లో జరిగే కథే ‘ఇడుపు కాయితం’ అని, ప్రాంతీయతను దాటి ప్రతి ప్రేక్షకుడిని తాకే యూనివర్సల్ కథ ఇదని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం అందించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
నిర్మాత తబిత సుకుమార్ మాట్లాడుతూ, దర్శకుడు వంశీకృష్ణ కథ చెప్పిన క్షణంలోనే చిన్ననాటి జ్ఞాపకాలు కళ్లముందు కదిలాయని తెలిపారు. తెలంగాణ అమ్మాయిగా ఈ కథతో వెంటనే కనెక్ట్ అయ్యానని, అందుకే ఎలాంటి సందేహం లేకుండా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లో ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. పాత్రలు, భావోద్వేగాలను దర్శకుడు అద్భుతంగా తీర్చిదిద్దారని, ప్రేక్షకులు కూడా ఈ కథతో తప్పకుండా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారని ఆమె నమ్మకం వ్యక్తం చేశారు.
నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ, ఇది కేవలం తెలంగాణ కథ మాత్రమే కాదని, ప్రతి కుటుంబంలో ఉండే భావోద్వేగాలకు ప్రతిబింబమని అన్నారు. సబ్‌టైటిల్స్‌తో దేశంలో ఎక్కడ విడుదల చేసినా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే కథ ఇదని చెప్పారు. దర్శకుడు వంశీకృష్ణ కథ చెప్పిన విధానం తనను ఎంతగానో ఆకట్టుకుందని, ప్రియదర్శి ఈ కథను తమ వద్దకు తీసుకురాకపోయి ఉంటే ఇలాంటి మంచి ప్రాజెక్ట్‌ను మిస్ అయ్యేవాడినని అన్నారు. హీరోయిన్ నాగదుర్గ గురించి మాట్లాడుతూ, ఆమె ప్రతిభను చూసి ప్రత్యేకంగా ఒక డ్యాన్స్ నెంబర్‌ను కూడా ప్లాన్ చేశామని, ఆ పాట ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పారు.
తెలంగాణ ఫోక్ పాటలతో మంచి గుర్తింపు పొందిన నాగదుర్గ, ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయం అవుతుండటం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కథ తనను నమ్మిందని, దర్శకుడు వంశీకృష్ణ ఇచ్చిన నమ్మకమే శ్రీలత పాత్రను చేయడానికి ధైర్యం ఇచ్చిందని చెప్పారు. సుకుమార్, బన్నీ వాస్ తన ప్రతిభను గుర్తించి అవకాశం ఇవ్వడం జీవితంలో మరచిపోలేని ఘట్టమని అన్నారు.
హీరో ప్రియదర్శి మాట్లాడుతూ, ‘ఇడుపు కాయితం’ తన కెరీర్లో ఎంతో ప్రత్యేకమైన సినిమా అవుతుందని చెప్పారు. ఈ చిత్రం తెలంగాణ నేపథ్యంతో తెరకెక్కుతున్నా, ఇందులోని భావోద్వేగాలు ప్రపంచవ్యాప్తంగా ప్రతి కుటుంబానికి కనెక్ట్ అవుతాయని తెలిపారు. సినిమాలో శ్రీనివాస్ పాత్ర కోసం పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నానని, ఇకపై మాటల కంటే సినిమానే మాట్లాడుతుందని అన్నారు.
దర్శకుడు వంశీకృష్ణ దొండపాటి మాట్లాడుతూ, తన కథను నమ్మి అండగా నిలిచిన సుకుమార్, తబిత సుకుమార్, బన్నీ వాస్, ప్రియదర్శి సహా మొత్తం టీమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రేక్షకుల ఆశీర్వాదాలతో ‘ఇడుపు కాయితం’ అందరి హృదయాలను తాకే చిత్రంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ మట్టివాసన, కుటుంబ బంధాల సున్నితమైన భావోద్వేగాలు, బలమైన కథనం, సహజమైన పాత్రలతో ‘ఇడుపు కాయితం’ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటోంది. ప్రారంభ వేడుకతోనే సినీ వర్గాల్లో విశేష ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.