తెలుగు ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వెబ్ సిరీస్ ‘ఇసాకపట్నం’ స్ట్రీమింగ్ తేదీ ఖరారైంది. ప్రైమ్ వీడియో రూపొందించిన ఈ ప్రతిష్టాత్మక తెలుగు ఒరిజినల్ సిరీస్ జూలై 2 నుంచి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. యాక్షన్, రాజకీయాలు, కుటుంబ సంఘర్షణలు, ప్రతీకారం వంటి అంశాలతో రూపొందిన ఈ సిరీస్‌పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.
దర్శకుడు గ్యారీ బీహెచ్ తెరకెక్కించిన ఈ ఏడు ఎపిసోడ్ల థ్రిల్లర్‌కు ప్రశాంత్ రాఘతి కథను అందించగా, తాజుద్దీన్ సయ్యద్ సంభాషణలు రచించారు. తమడా మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై రాహుల్ తమడా, సందీప్ రెడ్డి బొర్రా సంయుక్తంగా నిర్మించారు.
కల్పిత పోర్ట్ టౌన్ నేపథ్యంలో సాగే ‘ఇసాకపట్నం’ కథ అధికారం కోసం జరిగే పోరాటాలు, రాజకీయ కుట్రలు, కుటుంబ విభేదాలు, గ్యాంగ్ వార్ల చుట్టూ తిరుగుతుంది. కథలోని భావోద్వేగాలు, అనూహ్య మలుపులు ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠకు గురిచేస్తాయని మేకర్స్ చెబుతున్నారు.
ఈ సిరీస్‌లో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించగా, సునీల్, నరేష్ అగస్త్య, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమకుల, రాజీవ్ కనకాల, మైమ్ గోపి, రోహిణి, బెనర్జీ, జ్వాలా కోటి, రవివర్మ, రాజా చెంబోలు తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ప్రైమ్ వీడియో ఇండియా ఒరిజినల్స్ విభాగాధిపతి నిఖిల్ మాధోక్ మాట్లాడుతూ, దక్షిణ భారతీయ కథలకు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోందని, అదే దిశగా ‘ఇసాకపట్నం’ మరో బలమైన ప్రయత్నమని పేర్కొన్నారు. కథలోని ప్రతీకారం, భావోద్వేగాలు, శక్తివంతమైన పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఆయన తెలిపారు.
నిర్మాతలు రాహుల్ తమడా, సందీప్ రెడ్డి బొర్రా మాట్లాడుతూ, ‘ఇసాకపట్నం’ కేవలం రివెంజ్ డ్రామా మాత్రమే కాదని, వ్యక్తిగత నష్టం, నమ్మకం, కుటుంబ బంధాలు, రాజకీయ ఆధిపత్య పోరాటం వంటి అంశాలను లోతుగా చూపించే కథ అని వెల్లడించారు. పోర్ట్ టౌన్ వాతావరణాన్ని సహజంగా తెరపై ఆవిష్కరించేందుకు చిత్రబృందం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలిపారు.
తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో డబ్బింగ్ వెర్షన్లతో పాటు ఇంగ్లీష్ సహా 15 భాషల్లో సబ్‌టైటిల్స్‌తో ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. భారత్‌తో పాటు 240కి పైగా దేశాలు, ప్రాంతాల్లో ప్రేక్షకులు ‘ఇసాకపట్నం’ను వీక్షించే అవకాశం ఉంటుంది.