Ramcharan Peddi Movie Thank You Meet
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని కొనసాగిస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం అన్ని ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం నిర్వహించిన ‘థ్యాంక్ యూ మీట్’లో హీరో రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా, నటుడు జగపతిబాబు సినిమాపై ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు.
Ramcharan Peddi Movie Thank You Meet
రామ్ చరణ్ మాట్లాడుతూ, బుచ్చిబాబు చెప్పిన కథను నమ్మి చేసిన ఈ సినిమా తన కెరీర్లో అత్యంత సంతృప్తినిచ్చిన చిత్రాల్లో ఒకటిగా నిలిచిందన్నారు. దేశ విదేశాల్లో రోజురోజుకూ పెరుగుతున్న కలెక్షన్లు, ప్రేక్షకుల స్పందన తనను ఆనందపరుస్తోందని చెప్పారు. “మనస్ఫూర్తిగా, నిజాయితీగా పని చేస్తే సినిమా ఎంత రిస్కీ అయినా ప్రేక్షకులు ఆదరిస్తారని ‘పెద్ది’ నిరూపించింది. ఈ విజయాన్ని అందించిన ప్రతి ప్రేక్షకుడికి శిరస్సు వంచి ధన్యవాదాలు” అని అన్నారు. సినిమా చూసిన ప్రేక్షకులు భావోద్వేగానికి లోనవుతున్నారని, తాను ఊహించని సన్నివేశాలకు కూడా థియేటర్లలో అద్భుతమైన స్పందన వస్తోందని చరణ్ తెలిపారు. జగపతి బాబు, శివ రాజ్‌కుమార్, ఏఆర్ రెహమాన్, నిర్మాత వెంకట సతీష్ కిలారు సహా మొత్తం టీమ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
జగపతిబాబు మాట్లాడుతూ, ‘పెద్ది’ సాధారణ విజయం కాదని, ఇది ప్రేక్షకులే గెలిపించిన సినిమా అని అన్నారు. “ఇది రేజర్ ఎడ్జ్‌పై నడిచిన కథ. చరణ్ ఈ సినిమాను భుజాలపై మోశాడు. ‘పెద్ది’ ఇప్పుడు ఒక కల్ట్‌గా మారిపోయింది. నా కెరీర్లో ఇదే బెస్ట్ పాత్ర” అని పేర్కొన్నారు.
Ramcharan Peddi Movie Thank You Meet
దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ, గ్రామీణ యువత ప్రతిభ, గుర్తింపు కోసం పోరాటం నేపథ్యంలో ఈ కథను రూపొందించినట్లు తెలిపారు. “ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ. గ్రామాల్లో ఉన్న యువతకు అవకాశం దొరికితే దేశానికి పతకాలు తీసుకురాగలరనే ఆలోచనతో ఈ కథ రాశాను. ఆ నమ్మకాన్ని రామ్ చరణ్ గారు కూడా పూర్తిగా విశ్వసించారు” అని చెప్పారు. సినిమాలోని ఎమోషనల్ సన్నివేశాలకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన తనకు దర్శకుడిగా అతిపెద్ద సంతృప్తినిస్తోందని తెలిపారు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్, నిర్మాత వెంకట సతీష్ కిలారు మాట్లాడుతూ ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు పెద్ద ఎత్తున థియేటర్లకు వస్తుండటమే సినిమాకు అతిపెద్ద బలం అని చెప్పారు. సోమవారం కూడా కలెక్షన్లు అసాధారణంగా ఉండటం సినిమాపై ఉన్న క్రేజ్‌కు నిదర్శనమని పేర్కొన్నారు.
‘పెద్ది’ కేవలం కమర్షియల్ సక్సెస్ మాత్రమే కాకుండా యువతకు స్ఫూర్తినిచ్చే చిత్రంగా నిలుస్తోందని, రామ్ చరణ్ కెరీర్లో మరో మైలురాయిగా మారిందని చిత్ర బృందం అభిప్రాయపడింది.