KamalHaasan join SingGeetham pre release event
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సింగ్ గీతం’ జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లపై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు.
కమల్ హాసన్ మాట్లాడుతూ, “సింగ్ గీతం నేను నిర్మించి ఉంటే బాగుండేదనిపించే సినిమా. నాగ్ అశ్విన్ నిర్మిస్తే నేను నిర్మించినట్లేనని భావిస్తున్నాను. సింగీతం గారి కథలు టైమ్‌లెస్. నాకు 20 ఏళ్ల వయసులో ఆయన చెప్పిన కథను ఇప్పుడు 70 ఏళ్ల వయసులో ప్రేక్షకుడిగా చూడబోతున్నాను. సినిమా పట్ల ఆయనకున్న ప్యాషన్ అసాధారణం” అని అన్నారు. అలాగే ‘పుష్పక విమానం’, ‘ముంబై ఎక్స్‌ప్రెస్’, ‘అపూర్వ సోదరులు’ వంటి చిత్రాల స్పిరిట్‌తోనే ‘సింగ్ గీతం’ తెరకెక్కిందని చెప్పారు.
KamalHaasan join SingGeetham pre release event
దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మాట్లాడుతూ, “ఈ చిత్రం నా 40 ఏళ్ల కల. ‘మాటలే పాటలైతే’ అనే ఆలోచనతో ఈ కథ పుట్టింది. ఈ సినిమా క్రెడిట్ మొత్తం నాగ్ అశ్విన్‌దే. ఆయన, వైజయంతి మూవీస్ నాపై చూపిన ప్రేమ, గౌరవం ఎప్పటికీ మర్చిపోలేను” అన్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ కథ ఆత్మను అద్భుతంగా పట్టుకున్నారని ప్రశంసించారు.
దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ, “సింగీతం గారి ప్రశంస ఆస్కార్ అవార్డు అందుకున్నంత ఆనందాన్ని ఇచ్చింది. సినిమాలో ప్రతి మాట పాటలా వినిపించేలా సంగీతం అందించడం పెద్ద సవాల్. ఈ సినిమా నాకు జీవితంలో ఒక అరుదైన అవకాశం” అన్నారు. చిత్రంలోని నటీనటులంతా తమ సొంత గొంతులతోనే పాటలు పాడటం ప్రత్యేకత అని వెల్లడించారు.
నిర్మాత అశ్వినీ దత్ మాట్లాడుతూ, “సింగీతం గారితో ప్రారంభించిన ఒక ప్రాజెక్ట్ సంవత్సరాల క్రితం ఆగిపోయింది. అప్పటి నుంచి ఈ కల నన్ను వెంటాడుతోంది. నాగ్ అశ్విన్, స్వప్న, ప్రియాంక ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టారని తెలిసినప్పుడు ఎంతో గర్వంగా అనిపించింది” అన్నారు.
హీరో ఆయాన్, హీరోయిన్ అహల్యా బమ్రూ, నటి శాలిని కొండెపుడి కూడా ఈ చిత్రంలో భాగం కావడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.