gunasekhar-story-first-heroes-later
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు గుణశేఖర్ మరోసారి కథల ప్రాముఖ్యతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రస్తుత సినీ ట్రెండ్లు, కథల ఎంపిక, భవిష్యత్ ప్రాజెక్టులు, అలాగే ఎన్నో ఏళ్లుగా చర్చల్లో ఉన్న ‘హిరణ్యకశ్యప’ ప్రాజెక్ట్‌పై స్పందించారు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోలను దృష్టిలో పెట్టుకుని కథలు రాసే ధోరణి పెరిగిపోయిందని గుణశేఖర్ అభిప్రాయపడ్డారు. ముందుగా కథ పుట్టాలి, ఆ తర్వాత ఆ కథకు సరిపోయే హీరోను ఎంపిక చేయాలని ఆయన పేర్కొన్నారు. హీరోల ఇమేజ్‌కు తగ్గట్టుగా కథలను మార్చడం వల్ల సినిమాలు ఒకే తరహా మూసలో పడిపోతున్నాయని చెప్పారు.
‘ఒక్కడు’ వంటి చిత్రాలను తాను ముందుగా కథగా అభివృద్ధి చేశానని, ఆ తర్వాతే ఆ కథకు మహేష్ బాబు సరిపోతారని భావించానని గుర్తు చేసుకున్నారు. ఒకవేళ హీరోని దృష్టిలో పెట్టుకుని కథ రాసి ఉంటే ఫలితం పూర్తిగా వేరుగా ఉండేదని వ్యాఖ్యానించారు.
gunasekhar-story-first-heroes-later
భారీ సెట్లు, అతిశయోక్తి హీరోయిజం కోసం ఇకపై కథలు రాయబోనని స్పష్టం చేసిన గుణశేఖర్, ప్రస్తుతం తన వద్ద నాలుగు కొత్త కథలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. వాటిలో ఒక కథ ఇప్పటికే పూర్తి స్థాయి డ్రాఫ్ట్ దశకు చేరుకుందని, త్వరలోనే ఓ స్టార్ హీరోకు వినిపించనున్నట్లు చెప్పారు. ఆ కథ చాలా హార్డ్ హిట్టింగ్‌గా ఉంటుందని, వెంటనే తెరకెక్కించాలని తనకు ఉత్సాహం కలిగించిందని అన్నారు.
ఇక భవిష్యత్తులో సినిమాల నిర్మాణ విషయంలో కూడా మార్పులు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. సరైన నిర్మాణ సంస్థలతో కలిసి పనిచేసే విధంగా ముందుకు వెళ్తానని చెప్పారు. అలాగే భారీ బడ్జెట్ అవసరమయ్యే ఒక పీరియడ్ డ్రామా కూడా తన వద్ద సిద్ధంగా ఉందని వెల్లడించారు.
చాలా కాలంగా చర్చల్లో ఉన్న ‘హిరణ్యకశ్యప’ ప్రాజెక్ట్‌పై స్పందిస్తూ, అది ఇప్పుడున్న రూపంలో ముందుకు వెళ్లే అవకాశం లేదని తెలిపారు. హాలీవుడ్ సంస్థ ఫాక్స్ స్టార్‌తో కలిసి ఈ చిత్రాన్ని రూపొందించాలని భావించామని, కానీ అనేక అనూహ్య పరిణామాల కారణంగా ప్రాజెక్ట్ నిలిచిపోయిందని వివరించారు. కరోనా పరిస్థితులు, సంస్థల విలీనాలు వంటి అంశాలు కూడా దానికి కారణమయ్యాయని చెప్పారు.
త్రివిక్రమ్ పేరు ఈ ప్రాజెక్ట్‌తో అనుసంధానమవడంపై కూడా ఆయన స్పందించారు. ప్రారంభ దశలో త్రివిక్రమ్ స్వయంగా తనకు ఫోన్ చేసి రచనా సహకారం అందిస్తానని చెప్పారని, తర్వాత ప్రాజెక్ట్ ముందుకు సాగకపోవడంతో పరిస్థితులు మారిపోయాయని తెలిపారు.
gunasekhar-story-first-heroes-later
ఇకపై సమయాన్ని వృథా చేయకుండా పూర్తిస్థాయి బౌండ్ స్క్రిప్ట్లతోనే హీరోలు, నిర్మాతలను సంప్రదించాలని నిర్ణయించుకున్నట్లు గుణశేఖర్ వెల్లడించారు. కథే ప్రధానమనే నమ్మకంతో, కొత్త తరహా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.