Suriya Vishwanath & Sons Release On August 14
రీసెంట్గా ‘వీరభద్రుడు’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన కోలీవుడ్ స్టార్ సూర్య.. త్వరలో మరో మూవీతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న స్ట్రయిట్ తెలుగు మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో గురువారం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్ర యూనిట్. ఇండిపెండెన్స్‌కి ఒకరోజు ముందు అంటే.. ఆగస్టు 14న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. భావోద్వేగాలు, హాస్యం, హృదయాన్ని తాకే కుటుంబ అనుబంధాలతో ఈ సినిమా ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందించడానికి సిద్ధమవుతోందని మేకర్స్ తెలియజేశారు. టీజర్, టైటిల్ ప్రకటించినప్పట్నుంచీ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా చిన్నారితో కలిసి సూర్య కనిపించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆయన వింటేజ్ చార్మ్‌ను గుర్తు చేస్తూ కుటుంబ ప్రేక్షకులను తక్షణమే ఆకట్టుకున్నాయి.
Suriya Vishwanath & Sons Release On August 14
‘సార్/వాథి’, ‘లక్కీ భాస్కర్’ వంటి వరుస విజయవంతమైన చిత్రాలను అందించిన దర్శకుడు వెంకీ అట్లూరి, మరోసారి బలమైన కుటుంబ విలువలు, హృద్యమైన కథనం కలిగిన ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ను అందించబోతున్నారు. ఈ చిత్రంలో మమితా బైజు, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, నిమిష్ రవి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టగా, బంగ్లాన్ కళా దర్శకుడిగా పనిచేస్తున్నారు. తమిళనాడులో ఈ చిత్రాన్ని థింక్ స్టూడియోస్ విడుదల చేయనుండగా, రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.