Shiva Rajkumar Interview About Peddi Movie
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘‘పెద్ది” పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై హైప్‌ను మరింత పెంచాయి. ఈ చిత్రంలో కీలకమైన ‘గౌర్నాయుడు’ పాత్ర పోషించిన కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. తన పాత్ర, రామ్ చరణ్ నటన, దర్శకుడు బుచ్చిబాబు పనితనం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
‘పెద్ది’ కథ విన్నప్పుడు మిమ్మల్ని ఎక్కువగా ఆకట్టుకున్న అంశం ఏమిటి?
ఇదొక అద్భుతమైన కథ. ఇందులో నేను చేసిన గౌర్నాయుడు పాత్ర చాలా బలంగా, భావోద్వేగాలతో ఉంటుంది. కథ వినగానే ఈ సినిమాలో భాగం కావాలనిపించింది. ఒక మంచి పాత్ర చేశాననే సంతృప్తి నాకు ఉంది.
గౌర్నాయుడు పాత్రలో ప్రత్యేకత ఏమిటి?
గౌర్నాయుడు పాత్రకు ఒక స్పష్టమైన లక్ష్యం ఉంటుంది. దర్శకుడు బుచ్చిబాబు ఆ పాత్రను ఎంతో అద్భుతంగా డిజైన్ చేశారు. పాత్రలో భావోద్వేగం, గౌరవం, అనుబంధం అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
ఇందులో మీరు రామ్ చరణ్‌కు కోచ్ పాత్రలో కనిపిస్తారా?
కొంతవరకు కోచ్లానే అనిపిస్తుంది. కానీ అది అంతకంటే ఎక్కువ. పెద్ది పాత్ర జర్నీలో గౌర్నాయుడు కీలకంగా ఉంటుంది. మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయత, ఎమోషన్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి.
రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ గురించి మీ అభిప్రాయం?
ఈ సినిమాతో రామ్ చరణ్ గారికి నేషనల్ అవార్డు వస్తుందని నేను నమ్ముతున్నాను. ఆయన చేసిన బాడీ ట్రాన్స్ఫర్మేషన్, పాత్ర కోసం పెట్టిన కష్టం అసాధారణం. దాదాపు రెండేళ్ల పాటు పూర్తిగా ఈ పాత్రలో జీవించారు. ఆయన నిజంగా గొప్ప నటుడు.
షూటింగ్ అనుభవం ఎలా అనిపించింది?
రామ్ చరణ్ గారు, దర్శకుడు, టెక్నీషియన్స్ అందరూ నన్ను కుటుంబ సభ్యుడిలా చూసుకున్నారు. ఆ వాతావరణం వల్లనే నేను పాత్రను ఇంకా బాగా చేయగలిగాను.
దర్శకుడు బుచ్చిబాబు గురించి?
బుచ్చిబాబు గారు ఫెంటాస్టిక్ డైరెక్టర్. కథకు ఏం అవసరమో అదే తెరకెక్కించారు. ఆయన స్టోరీ టెల్లింగ్, మేకింగ్ స్టైల్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతి పాత్రను ఎంతో డీటైల్‌గా డిజైన్ చేశారు.
సినిమాలోని ఇతర పాత్రలు, విజువల్స్ గురించి?
నా పాత్రతో పాటు జగపతిబాబు గారి పాత్ర కూడా చాలా బలంగా ఉంటుంది. సినిమాలో ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంది. అలాగే సినిమాటోగ్రాఫర్ ఆర్ రత్నవేలు గారు ఇచ్చిన విజువల్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి.
సినిమాలో మల్టిపుల్ స్పోర్ట్స్ ఉన్నాయని కనిపిస్తోంది?
అవును. సినిమాలో పలు క్రీడలు ఉంటాయి. కానీ అవన్నీ కథతో బలంగా అనుసంధానమై ఉంటాయి. బిగ్ స్క్రీన్‌పై ఆ ఎమోషన్ ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.
క్లైమాక్స్‌పై చాలా చర్చ జరుగుతోంది. ఏమంటారు?
క్లైమాక్స్ చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. దాన్ని థియేటర్లో చూసి అనుభవించాలి. మొత్తం ‘పెద్ది’ జర్నీ ప్రేక్షకులందరికీ నచ్చుతుంది.
నిర్మాత సతీష్ కిలారు గురించి?
సతీష్ గారు సినిమాపై ఎంతో ప్యాషన్ ఉన్న నిర్మాత. అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
Shiva Rajkumar Interview About Peddi Movie
ఒక పాత్ర కోసం మీరు ఎలా ప్రిపేర్ అవుతారు?
దర్శకుడు కథ చెప్పిన తర్వాత నేను ఒక స్టైల్‌ను ఊహించుకుంటాను. దాన్ని దర్శకుడితో చర్చించి, ఇద్దరం ఒక అవగాహనకు వచ్చాక ఆ పాత్రలోకి పరకాయప్రవేశం చేస్తాను
మీకు ఎలాంటి పాత్రలు చేయడం ఇష్టం?
మనసుకు నచ్చిన పాత్రలు చేయడం నాకు ఇష్టం. ‘పెద్ది’లో చేసిన గౌర్నాయుడు పాత్ర కూడా అలాంటిదే.
ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులు?
ప్రస్తుతం జైలర్ 2, ‘గుమ్మడి నరసయ్య’ చిత్రాలు చేస్తున్నాను. మంచి కథలు వస్తే తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది.