Chiranjeevi Responds Single Screens Issue
తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన సింగిల్ స్క్రీన్ థియేటర్ల పర్సెంటేజ్ షేరింగ్ సమస్యపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. పరిశ్రమలోని అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా పరిష్కారం కనుగొనే దిశగా ఆయన ముందడుగు వేయడం విశేషం.
తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు, తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు డి.సురేష్ బాబు, నిర్మాతలు కే ఎల్ నారాయణ, అల్లు అరవింద్‌తో పాటు తెలంగాణ ఛాంబర్ ఎగ్జిబిటర్ల ప్రతినిధులు చిరంజీవిని కలిసి సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడులు, మూతపడుతున్న థియేటర్ల పరిస్థితి, పర్సెంటేజ్ విధానం వల్ల తలెత్తుతున్న ఇబ్బందులపై చర్చించారు.
Chiranjeevi Responds Single Screens Issue
సమావేశంలో చిరంజీవి మాట్లాడుతూ.. ఈ అంశాన్ని ఒక్క సినిమా లేదా ఒక్క వర్గానికి పరిమితం చేయకుండా, పరిశ్రమ మొత్తం ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చూడాలని సూచించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు అత్యున్నత సంస్థగా ఉన్న తెలుగు ఫిలిం ఛాంబర్ తీసుకునే నిర్ణయాలను అందరూ గౌరవించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు ఏర్పాటైన కొన్ని కమిటీల పనితీరుపై సింగిల్ స్క్రీన్ వర్గాల్లో ఉన్న అసంతృప్తిని కూడా చిరంజీవి గుర్తించారు. అయితే ఈసారి ఛాంబర్ నియమించిన కమిటీ గడువులోపే దీనిపై నిర్ణయం తీసుకుని, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు సమాన న్యాయం జరిగేలా స్పష్టమైన పర్సెంటేజ్ మోడల్‌ను ప్రతిపాదిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. జూన్ 30లోపు నివేదిక వచ్చేలా తాను కూడా తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన దిల్ రాజు.. ఎగ్జిబిటర్ల సమస్యలను చిరంజీవి ఎంతో శ్రద్ధగా విన్నారని, సమస్య పరిష్కారానికి కమిటీ ద్వారా రెండు రోజుల్లో స్పష్టత తీసుకొస్తామని చెప్పారని తెలిపారు. దీనిపై అధికారిక ప్రకటనను త్వరలో తెలుగు ఫిలిం ఛాంబర్ విడుదల చేస్తుందని వెల్లడించారు.
ఎగ్జిబిటర్ల ప్రతినిధి శ్రీధర్ మాట్లాడుతూ.. “చిరంజీవి గారు మా సమస్యలను ఓపికగా విన్నారు. గంటకు పైగా జరిగిన సమావేశంలో థియేటర్ల పరిస్థితి, ఎదుర్కొంటున్న నష్టాలపై వివరించాం. ఆయన స్పందన మాకు నమ్మకం కలిగించింది” అని అన్నారు.
ఈ సమావేశంలో సునీల్ నారంగ్, భరత్ నారంగ్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు శేఖర్, అనుపమ్, సదానంద్ గౌడ్, సుదర్శన్ థియేటర్ యజమాని రాజ్ తదితరులు పాల్గొన్నారు.