Sing Geetham Movie Team in Vizag :
‘పుష్పక్’, ‘ఆదిత్య 369’ తర్వాత మరో సంచలనం.. ‘సింగ్ గీతం’
వైజాగ్‌లో సందడి చేసిన ‘సింగ్ గీతం’ టీమ్
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ ఫస్ట్ మ్యూజికల్ ఫాంటసీ మూవీ ‘సింగ్ గీతం’. 94 ఏళ్ల వయసులోనూ సినిమాను డైరెక్ట్ చేస్తూ క్రియేటివిటీకి హద్దులు లేవని మరోసారి నిరూపిస్తున్నారు. ఐకానిక్ మూకీ చిత్రం ‘పుష్పక్’ నుంచి విజనరీ సైన్స్ ఫిక్షన్ క్లాసిక్ ‘ఆదిత్య 369’ వరకు ఆయన క్రియేటివిటీకి పర్యాయపదంగా నిలిచారు. కమల్ హాసన్‌తో ఆయన చేసిన ‘విచిత్ర సహోదరులు’, ‘మైఖేల్ మదన కామరాజన్’ బెంచ్ మార్క్ సినిమాలుగా నిలిచాయి. ఇప్పుడు, భారతదేశపు మొట్టమొదటి మ్యూజికల్ ఫాంటసీగా రూపొందించబడిన ‘సింగ్ గీతం’తో అలరించబోతున్నారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లపై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రంలో హీరోగా అయాన్ నటిస్తుండగా, అహల్యా బమ్రూ, శాలిని కొండేపూడి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
Sing Geetham Movie Team in Vizag :
తాజాగా విశాఖపట్నంలో ‘మీట్ అవర్ వైజాగ్’ హీరో పేరుతో గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో అయాన్ మాట్లాడుతూ “మాది వైజాగ్. అక్కయ్యపాలెంలో పెరిగాను. ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లి తెలుగు సినిమాలో హీరోగా నటించడం చాలా ఆనందంగా ఉంది. ఇది నా తొలి చిత్రం. సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో, వైజయంతి మూవీస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో పనిచేయడం నిజంగా అదృష్టం. ఇలాంటి కాన్సెప్ట్‌తో ఇప్పటివరకు భారతీయ సినీ పరిశ్రమలో సినిమా రాలేదు. ఈ అవకాశం నాకు డ్రీమ్ కమ్ ట్రూ” అని అయాన్ అన్నారు.
అహల్యా బమ్రూ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో నేను ‘గౌరీ’ పాత్రలో కనిపించబోతున్నాను. వైజాగ్ చూస్తుంటే నాకు పాండిచ్చేరి గుర్తొస్తుంది. ఈ సినిమా కోసం తెలుగు కూడా నేర్చుకున్నాను. వైజయంతి మూవీస్‌లో పని చేయడం ప్రతి నటుడి కల. ఈ సినిమాతో నా ఆ కల నెరవేరింది” అని చెప్పింది.
శాలిని కొండేపూడి మాట్లాడుతూ “ఈ సినిమాలో నేను ‘రేణు’ పాత్రలో కనిపిస్తాను. ఇది చాలా ప్రత్యేకమైన విలన్ పాత్ర. ఇలాంటి పాత్రను ప్రేక్షకులు ఇప్పటివరకు చూడలేదు. మా ఇంట్లో వాళ్లు సరదాగా ‘నీలాంబరి తర్వాత నువ్వే’ అంటుంటారు” అంటూ శాలిని నవ్వులు పూయించింది.
ఈ చిత్రానికి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ వీడియో కాల్ ద్వారా మాట్లాడుతూ, “సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో పనిచేయడం అరుదైన అవకాశం. ‘సింగ్ గీతం’ పూర్తి స్థాయి మ్యూజికల్ ఫిల్మ్. మేమంతా ఎంతో మనసుపెట్టి పనిచేశాం. ప్రేక్షకులు ఈ సినిమాను తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నాను” అన్నారు.
అయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండేపూడి, తులసి, బెనర్జీ, శివన్నారాయణ, అగు స్టాన్లీ తదితరులు నటించిన ఈ చిత్రం జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.