Ram Charan Peddi Bhopal Event
“నా ఫిల్మ్ లైబ్రరీలో నంబర్ వన్ సినిమా ‘పెద్ది’” – భోపాల్ ఈవెంట్లో రామ్ చరణ్
భోపాల్‌లో గ్రాండ్‌గా ‘పెద్ది కి ఆవాజ్’ ఈవెంట్
రామ్ చరణ్ ఎమోషనల్ స్పీచ్‌తో హైలైట్ అయిన ‘పెద్ది’ మ్యూజికల్ సెలబ్రేషన్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. దర్శకుడు బుచ్చిబాబు సానా రూపొందించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, రెండు చార్ట్‌బస్టర్ సాంగ్స్, పవర్ఫుల్ థియేట్రికల్ ట్రైలర్‌తో దేశవ్యాప్తంగా మంచి బజ్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా జూన్ 4న గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదలకు ముందు ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేస్తూ చిత్రబృందం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ‘పెద్ది కి ఆవాజ్’ పేరుతో భారీ మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించింది. మ్యూజిక్ సెన్సేషన్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని మూడో సింగిల్ ‘హల్లల్ల ల్లో’ ను ఈ ఈవెంట్లో అధికారికంగా విడుదల చేశారు. రెహమాన్ తన టీమ్‌తో కలిసి లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం ఈ వేడుకకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

Ram Charan Peddi Bhopal Event
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మధ్యప్రదేశ్ క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రి విశ్వాస్ సారంగ్ మాట్లాడుతూ.. భోపాల్ ప్రజలు కళాకారులను ఎంతో ప్రేమిస్తారని అన్నారు. ‘పెద్ది’ భారీ విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తూ, భవిష్యత్తులో చిత్రబృందం భోపాల్‌లో కూడా షూటింగ్ నిర్వహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన రామ్ చరణ్ తన మాటలతో అభిమానులను ఎమోషనల్ చేశారు. భోపాల్ ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, ‘పెద్ది’ ప్రమోషన్స్‌ను అక్కడి నుంచే ప్రారంభించడం తనకు ఎంతో భావోద్వేగంగా అనిపిస్తోందని చెప్పారు. సినిమా గురించి చరణ్ మాట్లాడుతూ.. “పెద్ది కేవలం స్పోర్ట్స్ ఫిల్మ్ మాత్రమే కాదు. తన గుర్తింపు కోసం పోరాడే ఓ వ్యక్తి కథ. ఆ పోరాటం ప్రతి ప్రేక్షకుడి మనసును తాకుతుంది. సినిమా చూసిన తర్వాత మళ్లీ మళ్లీ చూడాలనిపించే అనుభూతి కలుగుతుంది” అని అన్నారు. అలాగే, “నా కెరీర్లో ఎన్నో సినిమాలు చేశాను. కానీ నా ఫిల్మ్ లైబ్రరీలో ‘పెద్ది’ నంబర్ వన్ సినిమాగా నిలుస్తుంది” అని చెప్పడం ఈ ఈవెంట్లోనే బిగ్గెస్ట్ హైలైట్‌గా మారింది. తనతో కలిసి పనిచేసిన జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ, రవి కిషన్, దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాత సతీష్ కిలారు, అలాగే సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భోపాల్ ప్రజలు ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి చూపించిన ప్రేమను ‘పెద్ది’కి కూడా అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకుల ప్రేమను ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు. చాలా కాలంగా నేరుగా తెలుగు సినిమాకు సంగీతం అందించాలని అనుకుంటున్నానని, ‘పెద్ది’ రూపంలో ఆ అవకాశం రావడం ఆనందంగా ఉందని చెప్పారు. దర్శకుడు బుచ్చిబాబు కథ చెప్పినప్పుడు ఆయన ప్యాషన్ తనను బాగా ఆకట్టుకుందని తెలిపారు. ఇప్పటికే విడుదలైన పాటలకు వస్తున్న స్పందనపై సంతోషం వ్యక్తం చేసిన రెహమాన్, “రామ్ చరణ్ తన పెర్ఫార్మెన్స్, డ్యాన్స్‌తో పాటలను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఆయన ప్రతి మూమెంట్ వైరల్ అయింది” అని ప్రశంసించారు.
హీరోయిన్ జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. ‘పెద్ది’లో చాలా గొప్ప సందేశం ఉందని చెప్పింది. రామ్ చరణ్‌తో కలిసి నటించే అవకాశం రావడం తన అదృష్టమని, ఆయన అంకితభావం నిజంగా స్ఫూర్తిదాయకమని అని చెప్పింది. “ప్రతి పాత్రను ఎంత నిజాయితీతో చేస్తారో ఈ సినిమాలో కూడా అదే స్థాయిలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు” అంటూ చరణ్‌పై ప్రశంసలు కురిపించింది. అలాగే ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాకు మరింత ప్రాణం పోసిందని తెలియజేసింది.
సీనియర్ నటుడు రవి కిషన్ మాట్లాడుతూ.. ‘పెద్ది’ ప్రతి ప్రేక్షకుడి హృదయాన్ని తాకే సినిమా అని అన్నారు. మట్టిలో నుంచి ఎదిగి తన కలలను నిజం చేసుకోవాలని పోరాడే యువకుడి కథగా ఈ చిత్రాన్ని వివరించారు. “డబ్బింగ్ చెబుతున్నప్పుడు కొన్ని సన్నివేశాలు చూసి నా కళ్లల్లో నీళ్లు వచ్చాయి. ఈ సినిమాతో రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డు వస్తుందని ఆశిస్తున్నాను” అని అన్నారు. భారత యువతకు కొత్త ఆశను ఇచ్చే సినిమా ఇదని చెప్పారు.
ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్న నటుడు దివ్యేందు శర్మ మాట్లాడుతూ, రామ్ చరణ్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా అనిపించిందన్నారు. దర్శకుడు బుచ్చిబాబు అద్భుతమైన సినిమా తీశారని, ‘పెద్ది’ ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని తెలిపారు.
నిర్మాత వెంకట సతీష్ కిలారు మాట్లాడుతూ.. భోపాల్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. ఇంజినీరింగ్ పూర్తయ్యాక ఉద్యోగం కోసం అక్కడికి వచ్చి దాదాపు ఐదేళ్లు గడిపానని గుర్తుచేసుకున్నారు. “‘పెద్ది’ ప్రేక్షకులకు అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని ఇస్తుంది. రెండు సంవత్సరాల పాటు ఎంతో కష్టపడి ఈ సినిమాను తీశాం” అని చెప్పారు.
Ram Charan Peddi Bhopal Event
భోపాల్‌లో జరిగిన ‘పెద్ది కి ఆవాజ్’ ఈవెంట్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. రామ్ చరణ్ ఎమోషనల్ స్పీచ్, ఏఆర్ రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్, చిత్రబృందం చెప్పిన మాటలు అభిమానుల్లో సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా మంచి బజ్ క్రియేట్ చేసిన ‘పెద్ది’ విడుదల తర్వాత ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.