Crazy Kalyanam: A Story for Every Family
‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో అఖిల్ రాజ్ ఉడ్డెమారి, ఇప్పుడు ‘క్రేజీ కల్యాణం’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ‘నవరసరాయ’ డా. నరేష్ విజయ కృష్ణ, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మించారు. బద్రప్ప గాజుల దర్శకత్వం వహించారు. దసరా కానుకగా అక్టోబర్ 16న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అఖిల్.. తన పాత్ర, అనుపమతో నటించిన అనుభవం, సినిమాలోని ప్రత్యేకతలు, కథపై తనకున్న నమ్మకం గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
Crazy Kalyanam: A Story for Every Family
మంచి కథే నటుడిని ముందుకు తీసుకెళ్తుంది
నేను ఎప్పుడూ మంచి కథలో భాగం కావాలని కోరుకుంటాను. సినిమాలో నా పాత్ర ఎంతసేపు కనిపించిందనే దానికంటే, ఆ పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉంది, నటుడిగా నేను ఎంత బాగా చేయగలిగాను అనేదే నాకు ముఖ్యం. ‘క్రేజీ కల్యాణం’ కథ చదివినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ఇందులో నరేష్ గారు, తరుణ్ భాస్కర్ చేసిన పాత్రలు బాగా నచ్చాయి. ముఖ్యంగా తరుణ్ భాస్కర్ పోషించిన బాలరాజు పాత్ర చాలా హిలేరియస్‌గా ఉంటుంది. వీళ్లకు ధీటుగా నా ఉదయ్ పాత్ర కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా నటించాలని ప్రయత్నించాను. నిర్మాత జగన్ మోహన్ రెడ్డితో గతంలో ‘విందు భోజనం’ సినిమా చేశాను. అప్పటి నుంచే వారితో మంచి అనుబంధం ఉంది. ఈ సినిమా స్క్రిప్ట్ దశలోనే ఉదయ్ పాత్రకు నన్ను అనుకున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల, నిర్మాత నన్ను సంప్రదించినప్పుడు వెంటనే అంగీకరించాను. ఆ తర్వాత మిగతా నటీనటుల ఎంపిక జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు.
అనుపమతో నటించాలన్న అమ్మ కోరిక నెరవేరింది
‘రౌడీ బాయ్స్’ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించినప్పుడు నేను చిన్న పాత్ర చేశాను. ఆ సినిమా చూసిన మా అమ్మ.. నువ్వు హీరో అయ్యాక అనుపమతో కలిసి నటించాలని చెప్పింది. ఇప్పుడు ‘క్రేజీ కల్యాణం’తో ఆమె కోరిక నెరవేరడం నాకు చాలా సంతోషంగా ఉంది. అనుపమతో మొదట్లో నటించేటప్పుడు కొంత టెన్షన్ అనిపించింది. కానీ ఆమె ఇచ్చిన సపోర్ట్‌తో అర్ధరోజులోనే కంఫర్టబుల్‌గా ఫీలయ్యాను. ప్రతి సీన్‌కు ముందు మా పాత్రలు ఎలా ఉండాలి, సన్నివేశాన్ని ఎలా పండించాలి అనే విషయాలను చర్చించుకునేవాళ్లం. నటీనటులుగా కాకుండా ఆ పాత్రల్లోకి వెళ్లి సన్నివేశాలు చేశాం. సినిమాలో మా మధ్య వచ్చే ‘అలసెంద్రవంక’ పాట కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఆ పాటను డాక్టర్ గోరటి వెంకన్న రాయడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
ఉదయ్ పాత్రలో ప్రతి ఒక్కరూ తమను తాము చూసుకుంటారు
‘క్రేజీ కల్యాణం’లో నేను ఉదయ్ అనే యువకుడిగా కనిపిస్తాను. డిగ్రీ పూర్తి చేసిన అతను జీవితంలో మంచి స్థాయికి ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు. ఆ పాత్రలో ఒక ప్రత్యేకమైన ఎనర్జీ ఉంటుంది. ప్రేక్షకులు ఉదయ్‌ను తమ పక్కింటి కుర్రాడిలా భావిస్తారని నమ్ముతున్నాను. ‘రాజు వెడ్స్ రాంబాయి’లో రాజు పాత్ర కోసం ఎంత హోమ్‌వర్క్ చేశానో, ఈ సినిమాలో ఉదయ్ పాత్ర కోసం కూడా అంతే కష్టపడ్డాను. ప్రతి సినిమాకు నా వంతుగా వంద శాతం కృషి చేయడం అలవాటు. నా పాత్ర నిడివి కంటే అది కథకు ఎంత ఉపయోగపడుతుంది, తెరపై ఎంత సహజంగా కనిపిస్తుంది అనేదే నాకు ముఖ్యం.
ప్రాంతీయ నేపథ్యం ఉన్నా.. కథలో యూనివర్సల్ ఎమోషన్స్
మన ఊరిలో జరిగే కథలా, మన ఇంట్లో జరిగే సంఘటనలా ‘క్రేజీ కల్యాణం’ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది. ఇది తెలంగాణ నేపథ్యం, యాసతో సాగే సినిమా అయినప్పటికీ ఇందులోని భావోద్వేగాలు అన్ని ప్రాంతాల వారికీ కనెక్ట్ అవుతాయి. మంచి కంటెంట్ ఉన్నప్పుడు యాస, ప్రాంతం అనేవి విజయానికి అడ్డంకులు కావు. గతంలో ‘పెళ్లిచూపులు’ సినిమాను తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు కూడా ఆదరించారు. మా సినిమా విషయంలోనూ అలాంటి స్పందన వస్తుందని ఆశిస్తున్నాను. మంచి సినిమా చేస్తేనే నటుడిగా ముందుకు వెళ్లగలనని బలంగా నమ్ముతాను. మార్కెట్, కమర్షియాలిటీ గురించి ఆలోచించడం కంటే మంచి కథలో భాగమవడం నాకు ముఖ్యం. బాగాలేని సినిమాలో ఎక్కువసేపు కనిపించడం కంటే, మంచి సినిమాలో బాగా నటించాడనే పేరు సంపాదించుకోవడం ఎంతో విలువైనది.
ఈ సినిమాలో నరేష్ గారి పాత్ర మిగతా పాత్రల కంటే ప్రత్యేకంగా ఉంటుంది. ఆయనే మా సినిమాకు రియల్ హీరో అని చెప్పాలి. ఆయన పాత్ర ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. అనుపమ పాత్రకు నా పాత్ర ఎంత సపోర్ట్‌గా నిలుస్తుందో సినిమా చూస్తే తెలుస్తుంది. ఇలాంటి సీనియర్ నటీనటులతో కలిసి పనిచేయడం నాకు మంచి అనుభవాన్ని ఇచ్చింది.
స్టార్ సినిమాలతో పోటీ లేదు.. అందరూ సినిమాలను ఆదరించాలి
ఈ దసరాకు విడుదలయ్యే అన్ని సినిమాలను ప్రేక్షకులు ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. మా సినిమాను కూడా థియేటర్లకు వెళ్లి చూడండి. కుటుంబమంతా కలిసి చూసి ఆనందించేలా ‘క్రేజీ కల్యాణం’ ఉంటుంది. మేము ఏ స్టార్ హీరో సినిమాతోనూ పోటీ పడుతున్నామని అనుకోవడం లేదు. పెద్ద సినిమాలు బిర్యానీ అయితే మా సినిమా స్వీట్ లాంటిది. పండుగ సమయంలో ఎన్ని సినిమాలు వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను. నా తదుపరి సినిమా ‘శనార్తి’. ఇది రూటెడ్ కోర్ కల్ట్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఆశిస్తున్నాను. మనం ఒక లక్ష్యాన్ని నమ్మి కష్టపడితే తప్పకుండా దాన్ని చేరుకోగలమని నా ప్రయాణం ద్వారా తెలుసుకున్నాను.