Ranabaali Shoot Wrapped After 130 Days
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. ‘ట్యాక్సీవాలా’ తర్వాత విజయ్ దేవరకొండతో దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ చేస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో కీలక అప్డేట్ను మేకర్స్ ప్రకటించారు. ‘రణబాలి’ చిత్రీకరణ పూర్తయింది.
Ranabaali Shoot Wrapped After 130 Days
ఇటీవలే రష్మిక మందన్న తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసిన విషయం తెలిసిందే. తాజాగా మూవీకి సంబంధించిన మొత్తం షూటింగ్‌ను కంప్లీట్ చేశారు. దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ సోషల్ మీడియాలో యూనిట్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. 130 రోజుల షూటింగ్ జర్నీకి ముగింపు పలికినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తనతో పాటు పనిచేసిన యూనిట్‌ను ‘అలుపెరగని సైన్యం’గా అభివర్ణిస్తూ షూటింగ్ అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు.
భారీ ప్రొడక్షన్ స్కేల్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ 130 రోజుల పాటు సాగింది. చిత్రీకరణ పూర్తవడంతో ఇప్పుడు ‘రణబాలి’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోకి అడుగుపెట్టింది. మరోవైపు సినిమా విడుదల విషయంలోనూ మేకర్స్ స్పష్టత ఇచ్చారు. ఎలాంటి వాయిదా లేకుండా ముందుగా ప్రకటించిన తేదీకే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. అక్టోబర్ 16న దసరా కానుకగా ‘రణబాలి’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
19వ శతాబ్దపు బ్రిటీష్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో 1854 నుంచి 1878 మధ్య కాలానికి సంబంధించిన చారిత్రక ఘటనల స్ఫూర్తి కనిపించనుంది. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడే కథానాయకుడి చుట్టూ ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా సాగనుంది. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజయ్–అతుల్ సంగీతం అందిస్తుండగా.. జిష్ణు భట్టాచార్జీ, నీరవ్ షా సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కార్తిక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్‌గా, శివమ్ రావు నగసాని ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.
విజయ్ దేవరకొండ–రష్మిక మందన్న జంటగా ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ‘రణబాలి’పై సహజంగానే ఆసక్తి నెలకొంది. ఇప్పుడు 130 రోజుల షూటింగ్ పూర్తవడంతో అసలు కౌంట్‌డౌన్ మొదలైంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి అక్టోబర్ 16న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.