Audience Is the Real Hero: Trivikram on Viswanath & Sons
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా దూసుకెళ్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ కుటుంబ కథా చిత్రం ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైంది. సూర్య సరసన మమితా బైజు నటించగా.. రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
Audience Is the Real Hero: Trivikram on Viswanath & Sons
సహజమైన హాస్యం, కుటుంబ బంధాలు, భావోద్వేగాలతో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్‌లో సక్సెస్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్రబృందాన్ని అభినందించారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘విశ్వనాథ్ & సన్స్’ కథ తనకు ఎంతో నచ్చిందని తెలిపారు. ఈ రోజుల్లో ఇలాంటి కుటుంబ కథా చిత్రాన్ని తీసి విజయవంతం చేయడం అభినందనీయమన్నారు. సూర్యతో సినిమా చేయాలనే తన కోరికను కూడా ఆయన సరదాగా పంచుకున్నారు. తన సతీమణి సూర్యకు పెద్ద అభిమాని అని, ఆయనతో సినిమా చేయాలని తనను డిమాండ్ చేస్తుంటారని నవ్వుతూ చెప్పారు. సూర్య నటించిన ‘గజినీ’లోని సంజయ్ రామస్వామి పాత్ర ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిందని త్రివిక్రమ్ అన్నారు. అలాంటి పాత్రలు దశాబ్దాల పాటు మనతో ప్రయాణిస్తాయని చెప్పారు. ‘విశ్వనాథ్ & సన్స్’లో సూర్య తన పాత్రను చాలా అండర్‌ప్లే చేస్తూ అద్భుతంగా నటించారని ప్రశంసించారు. పాత్రలో ఎక్కువ చేయకుండా సహజంగా నటించడం చాలా కష్టమని, దాన్ని సూర్య అద్భుతంగా సాధించారని పేర్కొన్నారు. సినిమాలో సూర్య, రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్, మమితా బైజు నాలుగు ప్రధాన స్తంభాల్లా నిలిచారని త్రివిక్రమ్ అభిప్రాయపడ్డారు. రవీనా టాండన్ ఎంతో సహజంగా నటించారని, మమితా బైజు తన పాత్రకు తగ్గ ఎనర్జీతో ఆకట్టుకున్నారని అన్నారు. వెంకీ అట్లూరి రచన, దర్శకత్వాన్ని ప్రత్యేకంగా ప్రశంసించిన ఆయన.. సినిమాలోని కొన్ని సన్నివేశాలు భవిష్యత్తులో గుర్తుండిపోయే ఐకానిక్ సీన్లుగా నిలుస్తాయని చెప్పారు. సూర్య నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం వినయం అని త్రివిక్రమ్ అన్నారు. సూర్య, కార్తీలను తెలుగు ప్రేక్షకులు కూడా తమ హీరోలుగానే భావిస్తారని చెప్పారు. ప్రస్తుతం భాషల మధ్య హద్దులు చెరిగిపోయాయని, అన్ని భాషలు కలిసి ‘ఇండియన్ సినిమా’గా మారాయని పేర్కొన్నారు. ప్రపంచ వేదికపై భారతీయ సినిమా మరింతగా సత్తా చాటాల్సిన సమయం వచ్చిందన్నారు. ‘ఈ సినిమాకి నిజమైన హీరోలు ప్రేక్షకులే’ అని పేర్కొంటూ.. ‘విశ్వనాథ్ & సన్స్’ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ చిత్రబృందం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
హీరో సూర్య మాట్లాడుతూ.. ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు సరిపోవడం లేదన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ వేడుకకు రావడం ఎంతో ఆనందంగా ఉందని, ఆయన రాకతో ఈ కార్యక్రమం మరింత ప్రత్యేకంగా మారిందని చెప్పారు. సితార ఎంటర్టైన్మెంట్స్తో తన ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని సూర్య తెలిపారు. నాగవంశీతో కలిసి మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. విభిన్న ప్రాంతాలు, భాషలకు చెందిన తాము అందరం కలిసి ఒక మంచి సినిమా చేశామని, దాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారని సూర్య అన్నారు. ఈ సినిమా ద్వారా కుటుంబ కథా చిత్రాలకు ప్రేక్షకులు మరోసారి పెద్దపీట వేశారని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల నుంచి వస్తున్న స్పందన తమకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందన్నారు. ‘కొన్ని సినిమాలను కేవలం వసూళ్లతో కొలవలేం. ప్రేక్షకులు సినిమా చూసి పొందిన అనుభూతిలోనే అసలు విజయం ఉంటుంది’ అని సూర్య అన్నారు. ఇంత మంచి కథను అందించిన దర్శకుడు వెంకీ అట్లూరికి కృతజ్ఞతలు తెలుపుతూ.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
నటి రవీనా టాండన్ మాట్లాడుతూ.. ‘విశ్వనాథ్ & సన్స్’ విజయ వేడుకలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రేక్షకుల ప్రేమ, ఆదరణ వల్లే ఈ విజయం సాధ్యమైందని చెప్పారు. వెంకీ అట్లూరి ఎంతో వినయంగా, ప్రేమగా ఉంటూ నటీనటుల నుంచి మంచి నటనను రాబట్టారని ప్రశంసించారు. సినిమా షూటింగ్ ఎంతో సరదాగా, పిక్నిక్లా సాగిందని చెప్పారు. సూర్యకు ఉన్న క్రేజ్‌ను ప్రత్యేకంగా ప్రస్తావించిన రవీనా.. ఆయనను కలవడం కోసం తన స్నేహితులు కూడా సినిమా సెట్‌కు వచ్చేవారని తెలిపారు. రాధిక శరత్‌కుమార్‌తో కలిసి నటించడం తన అదృష్టమని చెప్పిన ఆమె.. సినిమాను నిర్మించిన నాగవంశీకి అభినందనలు తెలిపారు.
దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ ముందుగా ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. యాక్షన్, హారర్, డార్క్ కామెడీ, డివోషనల్ చిత్రాల ట్రెండ్ కొనసాగుతున్న సమయంలో కుటుంబ కథా చిత్రాన్ని చేయాలనే నిర్ణయానికి వంశీ మద్దతుగా నిలిచారని చెప్పారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తనను ఎంతో ప్రోత్సహించారని, ఆయన మద్దతు లేకుండా ఈ సినిమా సాధ్యమయ్యేది కాదని వెంకీ అన్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాను తన సినిమాగా భావించిన తర్వాత అన్నీ సులభంగా జరిగాయని చెప్పారు. మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు వసూళ్లు రెట్టింపు అయ్యాయని డిస్ట్రిబ్యూటర్లు చెప్పడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. తన కెరీర్లో ఇలా వసూళ్లు రెట్టింపు కావడం ఇదే తొలిసారి అని తెలిపారు. అందరూ తన రచనను ప్రశంసిస్తున్నప్పటికీ.. ఈ సినిమాను సూర్య తన భుజాలపై మోశారని వెంకీ అట్లూరి అన్నారు. సినిమా విజయానికి ప్రధాన క్రెడిట్ సూర్యకే దక్కుతుందని పేర్కొన్నారు.
ఈ సక్సెస్ మీట్లో చిత్ర పంపిణీదారులు, నటులు సునీల్ రెడ్డి, వైవా హర్ష, ఫైట్ మాస్టర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. సినిమా సాధిస్తున్న విజయంపై వారు ఆనందం వ్యక్తం చేశారు. ప్రేక్షకుల ఆదరణతో ‘విశ్వనాథ్ & సన్స్’ మరింత మంచి వసూళ్ల దిశగా సాగుతోందని చిత్రబృందం పేర్కొంది.