vadde naveen exclusive interview
దాపు 12 ఏళ్ల తర్వాత హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్న వడ్డే నవీన్, ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నానని చెప్పారు. కథపై తనకు ఉన్న విశ్వాసమే నిర్మాతగా మారేలా చేసిందని అన్నారు. వేరే నిర్మాత అయితే కథను మార్చేస్తారని కాదు.. కానీ ఈ కథను తానే నమ్మానని, అందుకే నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకున్నానని అన్నారు. కమల్ తేజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా వడ్డే నవీన్ చెప్పిన ఆసక్తికరమైన విషయాలు..
ఈ తరం ప్రేక్షకులు కేవలం కుటుంబ కథలు లేదా ప్రేమకథలతో సంతృప్తి చెందడం లేదని, కొత్త కంటెంట్‌తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండాలని కోరుకుంటున్నారని చెప్పారు. అదే ఆలోచనతో ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ను రూపొందించామని తెలిపారు. సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కూడా నచ్చేలా ఉంటుందని, కానీ రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా సాగుతుందని పేర్కొన్నారు.
vadde naveen exclusive interview
ఈ చిత్రంలో తాను కానిస్టేబుల్ త్రిమూర్తులు పాత్రలో కనిపిస్తానని, సిస్టంలో ఉంటూనే పోరాడే వ్యక్తిగా తన క్యారెక్టర్ డిజైన్ చేశామని చెప్పారు. స్క్రిప్ట్‌పై దాదాపు ఏడాది పాటు పని చేశామని, అవసరమైన చోట మాత్రమే ఫైట్లు, పాటలు పెట్టామని వెల్లడించారు. సినిమా నెమ్మదిగా ప్రారంభమైనా.. అసలు సంఘర్షణ మొదలైన తర్వాత క్లైమాక్స్ వరకు గ్రిప్పింగ్‌గా సాగుతుందని, ముగింపును మాత్రం ప్రేక్షకులు ఊహించలేరని ధీమా వ్యక్తం చేశారు.
పెద్ద దర్శకులతో కాకుండా కొత్త దర్శకుడు కమల్ తేజ నార్లతో సినిమా చేయడంపై కూడా నవీన్ స్పందించారు. ముందుగా తన మార్కెట్ ఏమిటో తెలుసుకోవాల్సి ఉందని, ఈ సినిమా తర్వాతే తదుపరి నిర్ణయాలు తీసుకుంటానన్నారు. తనతో సినిమా చేయాలనే ఆసక్తి పెద్ద దర్శకులకు కూడా ఉండాలని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ప్రేక్షకులు తనపై చూపిస్తున్న అభిమానాన్ని చూస్తుంటే ఆనందంగా ఉందని చెప్పారు. గత 12 ఏళ్లుగా ఎక్కడ కనిపించినా ‘మళ్లీ సినిమాలు చేయండి’ అని అభిమానులు అడిగేవారని, ఇప్పుడు అదే ప్రేమ ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’పై కనిపిస్తోందన్నారు. ఇప్పటికే తన కుటుంబ సభ్యుల్లో వంద మందికి పైగా సినిమా చూసి మంచి స్పందన ఇచ్చారని, కథ, కంటెంట్ చూసి అందరూ ఆశ్చర్యపోయారని వెల్లడించారు.
నాని, శర్వానంద్ లాంటి హీరోలు మంచి కథలను ఎంచుకుంటున్నారని ప్రశంసించిన వడ్డే నవీన్.. భవిష్యత్తులో కూడా సోలో హీరోగానే కొనసాగాలని ఉందని, అయితే కథ నచ్చితే మల్టీస్టారర్ లేదా ఓటీటీ ప్రాజెక్ట్ చేయడానికి కూడా సిద్ధమేనని చెప్పారు.