Maa Inti Bangaaram First Choice Sai Pallavi
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించిన చిత్రం ‘మా ఇంటి బంగారం’. నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జూన్ 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా సమంత చేసిన వ్యాఖ్యలు ఈ చిత్రాన్ని మరోసారి వార్తల్లో నిలిపాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాలో మొదట తాను నటించాల్సింది కాదని, సాయి పల్లవి కోసం ఈ కథను రెడీ చేసినట్టు సమంత స్వయంగా చెప్పింది. ఇటీవల సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చిట్ చాట్‌లో మాట్లాడిన సమంత.. ‘మా ఇంటి బంగారం’ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. “నిజానికి నేను ఈ సినిమాను ఎంపిక చేసుకోలేదు. ఈ సినిమానే నన్ను ఎంపిక చేసుకుంది” అంటూ ఆమె చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సమంత చెప్పిన వివరాల ప్రకారం, మహిళా ప్రధాన కథలతో సినిమాలు రూపొందించాలనే లక్ష్యంతో తమ నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. మొదట ఈ కథను సాయి పల్లవిని దృష్టిలో పెట్టుకుని డెవలప్ చేశారట. ఆమెకు కథ చెప్పి నటింపజేయాలని కూడా భావించారట. అయితే అప్పట్లో సాయి పల్లవి వరుస సినిమాలు, ఇతర కమిట్మెంట్లతో బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌కు డేట్స్ కేటాయించడం సాధ్యపడలేదని తెలిసింది. సాయి పల్లవి అందుబాటులో లేకపోవడంతో ఆ తర్వాత రచయితలు, దర్శకులు కథలో కొన్ని మార్పులు చేసి, సమంత ఇమేజ్‌కు అనుగుణంగా స్క్రిప్ట్‌ను మలిచారని ఆమె వెల్లడించారు. సమంత చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. ముఖ్యంగా “అసలు బంగారం నేను కాదు, సాయి పల్లవి” అనే భావనతో ఆమె చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకున్నాయి. అంతేకాదు, భవిష్యత్తులో తన నిర్మాణ సంస్థలో రూపొందించే ఏదో ఒక ప్రాజెక్ట్‌లో సాయి పల్లవితో తప్పకుండా కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్లు సమంత వెల్లడించారు.
Maa Inti Bangaaram First Choice Sai Pallavi
ఈ విషయంపై సాయి పల్లవి కూడా స్పందించడం విశేషం. సమంత వ్యాఖ్యలను చూసిన ఆమె, “ఈ సినిమా సమంత చేయాల్సిందే. అది ఆమె కోసం రాసి పెట్టినట్టే ఉంది” అంటూ ప్రేమతో కూడిన శుభాకాంక్షలు తెలియజేశారు. దర్శకురాలు నందినీ రెడ్డికి, సమంతకు బెస్ట్ విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో స్పందించారు. దీంతో ఈ ఇద్దరు స్టార్ నటీమణుల మధ్య ఉన్న పరస్పర గౌరవం అభిమానులను మరింత ఆకట్టుకుంది.