Ranabaali completed 100 days of shooting
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా తాజాగా మరో కీలక మైలురాయిని చేరుకుంది. చిత్ర బృందం విజయవంతంగా 100 రోజుల షూటింగ్‌ను పూర్తి చేసినట్లు అధికారికంగా ప్రకటించింది.
Ranabaali completed 100 days of shooting
19వ శతాబ్దం నాటి భారతదేశాన్ని నేపథ్యంగా తీసుకుని, 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో చోటుచేసుకున్న యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చరిత్ర, భావోద్వేగాలు, యాక్షన్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ప్రత్యేక పరిశోధనలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని చారిత్రక ప్రదేశమైన గండికోటలో కీలక షెడ్యూల్‌ను చిత్రీకరించారు. వారం రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల మధ్య వచ్చే భావోద్వేగభరిత సన్నివేశాలను తెరకెక్కించారు. కథలో ఈ సన్నివేశాలు కీలక పాత్ర పోషిస్తాయని సమాచారం.
ఇప్పటివరకు సినిమా షూటింగ్లో దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం మిగిలిన భాగాన్ని పూర్తి చేసే పనిలో చిత్ర యూనిట్ ఉందని మేకర్స్ వెల్లడించారు. ఇప్పటికే చిత్రీకరించిన సన్నివేశాల అవుట్‌పుట్‌పై దర్శకుడు, నిర్మాతలు పూర్తి సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఇటీవల విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘రణబాలి’ గ్లింప్స్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన అందుకుంది. ముఖ్యంగా అందులోని భారీ యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్, విజయ్ లుక్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ గ్లింప్స్ సినిమాకు సంబంధించిన ఆసక్తిని మరింత పెంచింది.
Ranabaali completed 100 days of shooting
మరో విశేషం ఏమిటంటే, హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. అంతర్జాతీయ స్థాయి నటుడు ఈ ప్రాజెక్ట్‌లో భాగమవ్వడం సినిమాకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.
టీ-సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీత దర్శక ద్వయం అజయ్-అతుల్ సంగీతం అందిస్తుండగా, సాంకేతికంగా కూడా ఈ చిత్రాన్ని అత్యున్నత ప్రమాణాలతో రూపొందిస్తున్నారు.
ఇక విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్లో వచ్చిన ‘ట్యాక్సీవాలా’ ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో ‘రణబాలి’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చారిత్రక కథాంశం, భారీ నిర్మాణ విలువలు, స్టార్ కాస్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో విజయ్ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.