పూరి జగన్నాథ్… ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంటుంది. దర్శకుడిగా ఆయన తీసిన సినిమాలు ఎలాంటి క్రేజ్‌ను సృష్టించాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ‘ఎప్పుడు వచ్చాం అన్నది కాదు అన్నయ్య.. బుల్లెట్ దిగిందా లేదా..’ లాంటి డైలాగ్స్‌తో తెలుగు ప్రేక్షకులకు సరికొత్త ట్రెండ్‌ను చూపించారు. సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తనదైన శైలిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్ Puri Jagannadh తన సినీ ప్రయాణంలో 26 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి Vijay Sethupathi హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేశారు.
‘మక్కల్ సెల్వన్’ గా ప్రేక్షకుల ప్రేమను పొందిన విజయ్ సేతుపతి.. ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో ‘స్లమ్‌డాగ్ 33 టెంపుల్ రోల్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్‌తో విజయ్ సేతుపతి తన అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఒక ఎమోషనల్ నోట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ముఖ్యంగా SLUMDOG – 33 Temple Road సినిమా షూటింగ్ సమయంలో పూరి జగన్నాథ్ తనలోని నటుడిని కొత్త స్థాయికి తీసుకెళ్లిన విధానాన్ని ఆయన ప్రశంసించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వ శైలి గురించి మాట్లాడుతూ..‘‘ ఆయన fearless voice (భయపడని స్వరం), కథల ఎంపికలోని ధైర్యం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని విజయ్ తెలిపారు. నటుల నుండి అత్యుత్తమ ప్రతిభను వెలికి తీసే సామర్థ్యం పూరి ప్రత్యేకత అని ఆయన అన్నారు. సినిమా పరిశ్రమలో 26 సంవత్సరాల ప్రయాణం పూర్తి చేసిన పూరి జగన్నాథ్, ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా, కొత్త కథనాలతో కొత్త తరహా సినిమాలకు మార్గం సుగమం చేశారు. ఆయన ప్రయాణం ఎంతో మందికి ప్రేరణగా నిలిచింది’’ అని పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో #26YearsOfPuriJagannadh హ్యాష్‌ట్యాగ్‌తో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ‘స్లమ్ డాగ్.. 33 టెంపుల్ రోడ్’ చిత్ర విషయానికొస్తే.. ఇటీవల విడుదల చేసిన విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్న దునియా విజయ్ లుక్‌కు కూడా మంచి స్పందన లభించింది. సంయుక్త హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో టబు కీలకపాత్ర పోషిస్తున్నారు. బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్, చార్మీ కౌర్, జెబి మోహన్ పిక్చర్స్ జెబి నారాయణరావు కొండ్రోల్లాతో కలిసి నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు.
ఇక పూరి జగన్నాథ్ గురించి మాట్లాడుకుంటే.. ఒకనొక సందర్భంలో రాజమౌళి సైతం ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తారు. తామెంతో కష్టపడి నెలలు నెలలు ఓ సీన్‌ను తీస్తే.. పూరి జగన్నాథ్ సింగిల్ డైలాగ్‌తో ప్రేక్షకులను మనసులను గెలుచుకుంటారని చెప్పారు. అలాగే రాజమౌళి తండ్రి గ్రేట్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కూడా తాను పూరికి పెద్ద అభిమానిని అని చెప్పుకుంటారు. అలా సినీ ఇండస్ట్రీలోనే చాలామంది ప్రముఖులు ఆయన్ను అభిమానిస్తుంటారు. గెలుపొటములు ఎలా ఉన్నా.. తను పడే కష్టంలో ఎలాంటి తేడా లేదని పూరి జగన్నాథ్ చెప్పడం విశేషం.
పూరి జగన్నాథ్ తెలుగు సినిమాల్లో తనదైన శైలిలో పవర్ ఫుల్, పంచ్ డైలాగ్‌లు, యాటిట్యూడ్ డైలాగ్స్‌కు ప్రసిద్ధి చెందారు. ఆయన సినిమాల్లోని కొన్ని పాపులర్ డైలాగ్స్ ఇక్కడ ఉన్నాయి:
“నువ్వు నందా అయితే.. నేను బద్రి.. బద్రి బద్రినాథ్” : బద్రి (Badri)
“సిటీకి ఎంతోమంది కమీషనర్లు వస్తూ ఉంటారు.. పోతూ ఉంటారు, చంటిగాడు లోకల్” : ఇడియట్ (Idiot)
“ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో, వాడే పండుగాడు” : పోకిరి (Pokiri)
“నేను మెల్లగా ఎలాగోలా బ్రతికేయడానికి రాలేదూ… ముంబయి ని ఏలడానికి వచ్చా” : బిజినెస్‌మ్యాన్ (Businessman)
పూరి జగన్నాథ్ పెన్నులోనుంచి వచ్చిన వపర్‌ఫుల్ డైలాగ్స్ ఇంకెన్నో ఉన్నాయి. తన సినిమాల్లో హీరోల క్యారెక్టర్లను స్టైలిష్‌గా, కాస్త నెగెటివ్ షేడ్స్‌తో చూపిస్తూ, వాటికి తగ్గట్టే పవర్ ఫుల్ డైలాగ్స్ రాస్తారు.






