Dora Sai Teja Dhandha Telugu Review
యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా కంటెంట్‌తో గుర్తింపు తెచ్చుకున్న దొర సాయి తేజ హీరోగా నటించిన మైక్రో డ్రామా ‘దందా’ చాయ్ షాట్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సైబర్ క్రైమ్ నేపథ్యంలో రూపొందిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.
నటీనటులు : దొర సాయి తేజ, అక్షర్ నల్ల, నితిన్ ప్రసన్న, కిరణ్ కుమార్ కామ్తం, సూరి కె చాప్లిన్, విక్రమ్ దేవా తదితరులు
దర్శకత్వం : ఆదిత్య దేవులపల్లి
కథ : విజయ్ కుమార్
సంగీతం : ఎం. రిషి
సినిమాటోగ్రఫీ : అశ్విన్ లెనిన్
ఎడిటింగ్ : జగదీష్ గౌడ్
ఓటీటీ : చాయ్ షాట్స్
రేటింగ్ : 3/5
కథ విషయానికొస్తే..
బీటెక్ చదువుతున్న అరవింద్ (దొర సాయి తేజ) పేదరికం నుంచి బయటపడాలని, త్వరగా డబ్బు సంపాదించాలని కలలు కంటాడు. ఆ ఆశతో సైబర్ నేరాల బాట పడతాడు. చిన్న చిన్న ఆన్లైన్ మోసాలతో మొదలైన అతని ప్రయాణం క్రమంగా పెద్ద సైబర్ క్రైమ్ నెట్వర్క్ వరకు చేరుతుంది. ఈ క్రమంలో ప్రకాష్ ఠాకూర్‌తో పరిచయం అతని జీవితాన్ని కీలక మలుపు తిప్పుతుంది. మరోవైపు తన క్లాస్మేట్ నీలు పట్ల ప్రేమ కూడా అతని జీవితంలో భాగమవుతుంది. చివరకు పోలీసులు అరవింద్‌ను ఎలా ట్రాక్ చేశారు? అతను చేసిన నేరాలకు ఎలాంటి ముగింపు వచ్చింది? అనేదే మిగతా కథ.

విశ్లేషణ
ప్రస్తుతం మైక్రో డ్రామాల ట్రెండ్ వేగంగా విస్తరిస్తోంది. రెండు నుంచి మూడు నిమిషాల నిడివి ఉన్న ఎపిసోడ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న ఈ ఫార్మాట్లో వచ్చిన ‘దందా’, సైబర్ క్రైమ్ అనే సమకాలీన అంశాన్ని ఎంచుకోవడం విశేషం. సాధారణ ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యేలా ఫిషింగ్ స్కామ్స్, ఓటీపీ మోసాలు, డిజిటల్ ఫ్రాడ్స్ ఎలా జరుగుతాయో కథలో భాగంగా చూపించిన తీరు బాగుంది. వినోదంతో పాటు అవగాహన కల్పించే ప్రయత్నం దర్శకుడు ఆదిత్య దేవులపల్లి చేశారు. ప్రతి ఎపిసోడ్ చివర ఆసక్తిని పెంచేలా ముగించడం వల్ల తర్వాతి ఎపిసోడ్ చూడాలనే ఆసక్తి కొనసాగుతుంది.
యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న దొర సాయి తేజకు ఇది నటుడిగా మంచి అవకాశమని చెప్పొచ్చు. నెగటివ్ షేడ్స్ ఉన్న అరవింద్ పాత్రలో అతను సహజంగా నటించాడు. విజయమే లక్ష్యంగా ఎలాంటి నిర్ణయానికైనా సిద్ధపడే యువకుడి మనస్తత్వాన్ని తన హావభావాలతో చూపించాడు. కొన్ని కీలక సన్నివేశాల్లో అతని నటన ఆకట్టుకుంటుంది. అక్షర్ నల్ల, నితిన్ ప్రసన్న, కిరణ్ కుమార్ కామ్తం, సూరి కె చాప్లిన్, విక్రమ్ దేవా తమ పాత్రల పరిధిలో చక్కగా నటించారు. కథ అందించిన విజయ్ కుమార్ రాసిన కొన్ని డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఎం. రిషి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సిరీస్‌కు మంచి బలం. థ్రిల్లర్ మూడ్‌ను మరింత ఎలివేట్ చేసింది. అశ్విన్ లెనిన్ సినిమాటోగ్రఫీ, జగదీష్ గౌడ్ ఎడిటింగ్ కూడా కథ వేగాన్ని నిలబెట్టాయి. అయితే కొన్ని చోట్ల కథ ముందే ఊహించగలిగేలా సాగుతుంది. కొన్ని పాత్రలకు మరింత లోతు ఇచ్చి ఉంటే భావోద్వేగ అనుసంధానం పెరిగేది. క్లైమాక్స్ కూడా ఇంకాస్త బలంగా ఉండే అవకాశం ఉంది.
ప్లస్ పాయింట్స్
దొర సాయి తేజ నటన
సైబర్ క్రైమ్ నేపథ్యం
ఎంగేజింగ్ మైక్రో ఎపిసోడ్స్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
అవగాహన కల్పించే కథనం
మైనస్ పాయింట్స్
కొన్ని ఊహించదగిన ట్విస్టులు
కొన్ని పాత్రలకు పరిమిత ప్రాధాన్యం
ఫైనల్‌గా..
సైబర్ క్రైమ్స్‌పై అవగాహన కల్పిస్తూనే థ్రిల్లర్ అంశాలతో ఆసక్తికరంగా సాగే మైక్రో డ్రామా ‘దందా’. తక్కువ నిడివిలో ఎంగేజింగ్ కథను చెప్పడంలో టీమ్ చాలా వరకు సక్సెస్ అయింది. ముఖ్యంగా దొర సాయి తేజ నటన ఈ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణ. మైక్రో డ్రామాలు, క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఒకసారి చూసేలా ఉండే సిరీస్.
రేటింగ్ : 3/5